Share News

మహానాడు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - May 27 , 2026 | 01:37 AM

తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో టీడీపీ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ మూడు జిల్లాల టీడీపీ కో ఆర్డినేటర్‌, ఏపీ మారిటైమ్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దామచర్ల సత్య వెల్లడించారు

మహానాడు ఏర్పాట్లు పూర్తి
దామచర్ల సత్య

తిరుపతి, మే 26 (ఆంధ్రజ్యోతి): తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో టీడీపీ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ మూడు జిల్లాల టీడీపీ కో ఆర్డినేటర్‌, ఏపీ మారిటైమ్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దామచర్ల సత్య వెల్లడించారు.మంగళవారం ఆయన తిరుపతిలో ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఇటీవలే మూడు జిల్లాల పార్టీ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టిన తాను మహానాడు క్లస్టర్‌ స్థాయి సమావేశాలు వంటి బృహత్‌ కార్యక్రమాన్ని సవాల్‌గా తీసుకున్నామన్నారు. రెండు రోజుల వ్యవధిలోనే మూడు జిల్లాల్లో పర్యటించి ఆయా పార్లమెంటు కమిటీల ఛైర్మన్లు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జులతో సమావేశాలు నిర్వహించామన్నారు. తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహానాడు సమావేశాలను క్లస్టర్ల స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. క్లస్టర్‌ సమావేశాల వేదికలను ఇప్పటికే గుర్తించడం, అక్కడ సమావేశాలకు

ఏర్పాట్లు చేయడం పూర్తయిందన్నారు. వేదికల వద్ద భారీ పరిమాణంలో ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి క్లస్టర్‌ సమావేశానికీ కనీసం 300 నుంచీ గరిష్టంగా 500 మంది కార్యకర్తలను ఆహ్వానించాలని పార్టీ ఆదేశించిందన్నారు. సమావేశాలకు హాజరయ్యే కార్యకర్తలకు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ ఏర్పాటు చేస్తున్నామని, వేసవి ఎండలను దృష్టిలో వుంచుకుని తాగునీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు వంటివి అందుబాటులో వుంచుతున్నామన్నారు. మహానాడులో చర్చించే అంశాలు, చేపట్టే తీర్మానాలకు సంబంధించిన మెటీరియల్‌ కూడా ఇప్పటికే క్లస్టర్‌ స్థాయి సమావేశాల ప్రాంగణానికి చేర్చడం జరిగిందన్నారు.పార్టీ కార్యకర్తలు తమ మండలాల్లో జరిగే సమావేశాలకు హాజరై వివిధ అంశాలపై జరిపే చర్చలను, పార్టీ చేపట్టే తీర్మానాలను వీక్షించి అవగాహన ఏర్పరుచుకోవాలని కోరారు.

---------------------------------

Updated Date - May 27 , 2026 | 01:37 AM