మధుసూదన్‌కు పుంగనూరు టీడీపీ పగ్గాలు
ABN , Publish Date - Aug 30 , 2026 | 01:29 AM
పుంగనూరు నియోజవర్గ తెలుగుదేశం పార్టీ నూతన ఇన్‌చార్జిగా వై.మధుసూదన్‌నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ శనివారం ప్రకటించారు.
ఇన్‌చార్జిగా నియామక ప్రకటన చేసిన పల్లా శ్రీనివాస్
పుంగనూరు, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): పుంగనూరు నియోజవర్గ తెలుగుదేశం పార్టీ నూతన ఇన్‌చార్జిగా వై.మధుసూదన్‌నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ శనివారం ప్రకటించారు. సోమల మండలం ఇరికిపెంట పంచాయతీ మేటిమందకు చెందిన మాజీ సర్పంచ్ వై.భాస్కర్ నాయుడు కుమారుడైన ఈయన మంత్రి లోకేశ్‌కు సన్నిహితంగా ఉంటున్నారు. కాగా, శాసనసభ ఎన్నికలకు ముందు రొంపిచెర్లకు చెందిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డిని ఇన్‌చార్జిగా, తర్వాత పుంగనూరు అభ్యర్థిగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కేవలం 5 వేల ఓట్లతో పుంగనూరు వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆయన ఓటమి చెందారు. తర్వాత ఏడాదిపాటు వైసీపీ నేతలు, పెద్దిరెడ్డి కుటుంబాన్ని నియోజకవర్గంలో పర్యటించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పుంగనూరు కౌన్సిలర్లు, పులిచెర్ల జడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు పలువురు నాయకులను టీడీపీలో చేర్చుకున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు సాగుతున్నాయి. మరో వైపు చల్లా రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆయన ప్రత్యర్థివర్గం పావులు కదిపింది. పీలేరు, పలమనేరు ఎమ్మెల్యేలు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, ఎన్.అమరనాథరెడ్డి వద్దకు వీరు వెళ్లి ఫిర్యాదులుచేస్తూ.. పుంగనూరులో టీడీపీని కాపాడాలని చర్చించారు. తరచూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తదితర నేతలను కలిశారు. నియోజకవర్గంలో కొందరు చేసిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలపై ఫిర్యాదులు చేస్తూ.. వారికి చల్లా సహకారం ఉందని ఆరోపించారు. ఇటీవల తిరుపతిలో మంత్రులు బీసీ జనార్దనరెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, పరిశీలకుడు దామచర్ల సత్య ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ సమావేశంలో జరిగిన ఘర్షణలు తదితర అంశాలపై అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో నియోజకవర్గ ఇన్‌చార్జి మార్పుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ నేతలకు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. అసమ్మతి నాయకులకు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారంచేసే మేటిమంద మధుసూదన్‌నాయుడు నాయకత్వం వహించి ఇన్‌చార్జి మార్పులో విజయం సాధించారు. మరికొంతమంది కూడా ఇన్‌చార్జి పదవికి ప్రయత్నించినా మధుసూదన్‌నాయుడు వైపు సీఎం చంద్రబాబు మొగ్గుచూపారు. దీనిపై గురువారం రాత్రి అమరావతిలోని సీఎం చంద్రబాబు ఇంటివద్ద చల్లా రామచంద్రారెడ్డి, మధుసూదన్‌నాయుడుతో మాట్లాడి ఇన్‌చార్జి మార్పుపై స్పష్టతనిచ్చారు. శుక్రవారం పాడ్యమి ఘడియలు ఉండటంతో శనివారం ప్రకటించాలని మధుసూదన్‌నాయుడు చంద్రబాబును అభ్యర్థించినట్లు తెలిసింది. అందుకని పల్లా శ్రీనివాస్ శనివారం ప్రకటన చేశారు.
తేరుకోలేని చల్లా అనుచరులు
అక్రమ కేసుల్లో తీవ్ర ఇబ్బందులు పడటం, 60 రోజులు కడప జైలులో గడపడం, పలుమార్లు వైసీపీ దాడులు తదితర సమస్యలతో టీడీపీ శ్రేణులకు అండగా ఉంటున్న తమనేత చల్లా రామచంద్రారెడ్డిని ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించడమేంటని ఆయన అనుచరులు తీవ్ర ఆవేదనతో తేరుకోలేకపోతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఒకే పార్టీలో ఉంటున్న తమ నాయకుడికి అన్యాయం జరిగిందని వాపోయారు.
మధుసూదన్‌నాయుడు వర్గీయుల్లో సంబరాలు
తమ నేత మధుసూదన్‌నాయుడికి ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వడంతో ఆయన వర్గీయులు సంబరాలు జరుపుకొన్నారు. ఇన్‌చార్జి ప్రకటన వెలువడగానే పలుచోట్ల బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచి అభిమానాన్ని చాటుకున్నారు. పుంగనూరుకు ఇక పూర్వవైభవం వస్తుందని వీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.