Share News

ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌లో మదనపల్లెకు అగ్రస్థానం

ABN , Publish Date - Jul 19 , 2026 | 01:30 AM

మదనపల్లె సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ రెండోసారి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచింది. మొన్న ఆస్థి పన్ను వసూళ్లలో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో, జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవగా, తాజాగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆపరేషన్‌ క్లీన్‌ స్విప్‌లో అగ్రస్థానం అందుకుంది.

ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌లో మదనపల్లెకు అగ్రస్థానం
సీఎం చంద్రబాబు నుంచి జ్ఞాపిక అందుకుంటున్న మున్సిపల్‌ కమిషనర్‌ కె.ప్రమీల, పక్కన పురపాలికశాఖ మంత్రి నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభి

సీఎం చేతుల మీదుగా అవార్డు ప్రదానం

మదనపల్లె, జూలై 18(ఆంధ్రజ్యోతి): మదనపల్లె సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ రెండోసారి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచింది. మొన్న ఆస్థి పన్ను వసూళ్లలో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో, జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవగా, తాజాగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆపరేషన్‌ క్లీన్‌ స్విప్‌లో అగ్రస్థానం అందుకుంది. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో తొమ్మిదింటిని మూడు కేటగిరిల్లో ఎంపిక చేయగా అందులో 50వేల నుంచి 3లక్షల జనాభా ఉన్న కేటగిరిలో మదనపల్లె ఎంపికైంది. అన్నింటా ముందుండి నడిపించిన మున్సిపల్‌ కమిషనర్‌ కె.ప్రమీల అవార్డులు, రివార్డులతోపాటు జ్ఞాపిక, ప్రశంసలు అందుకున్నారు. ఆస్తి పన్ను వసూళ్ల అంశంలో మున్సిపల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురే్‌షకుమార్‌ నాయర్‌ నుంచి జ్ఞాపిక, ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌లో ఏకంగా సీఎం చంద్రబాబునాయుడు, మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ నుంచి అవార్డు అందుకున్నారు. విజయవాడలో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కమిషనర్‌కు సన్మానాలు, అభినందలు వెల్లువెత్తాయి.

చేపట్టిన కార్యక్రమాలివీ..!

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రభుత్వం ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌ను అమలు చేసింది. మున్సిపల్‌ ప్రత్యేకాధికారి, జేసీ శివనారాయణ శర్మ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లు, గోడలపై పొగాకు, గుట్కా, పాన్‌ నమిలి ఉమ్మి వేసిన ప్రాంతాలను రెడ్‌ జోన్‌లుగా గుర్తించి శుభ్రం చేయడమేగాక గోడలపై పెయింటింగ్‌ వేయడం, జాతీయ నేతల బొమ్మలు గీయడం, తిరిగి అక్కడ అలాంటి అవకాశం లేకుండా పరిస్థితులను మార్పు చేశారు. చెత్త ఎక్కువగా డంప్‌ అయ్యే ప్రాంతాలను గుర్తించి, అక్కడ గార్బేజ్‌ అవసరం లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్‌ అయ్యేలా ఏర్పాట్లు చేపట్టారు. అక్కడ మొక్కలు నాటి గార్డెన్‌లుగా మార్పు చేశారు. ప్రజా మరుగుదొడ్ల నిర్వహణలో ఉత్తమ ఫలితాలు సాధించారు. పట్టణం గుండా వెళ్తున్న బాహుదానది, బాపనకాలువ, అల్లివంక గుండా వచ్చే కాలువల్లో పూడికతీసి మురుగునీటి నిల్వ లేకుండా ప్రవాహనం కొనసాగే ఏర్పాట్లు చేశారు. ప్రధాన కాలువల్లో చెత్తాచెదారం వేయకుండా ఇనుప గ్రీన్‌(కంచె) ఏర్పాటు చేసి, కుండీలలో పూలమొక్కలు నాటి, వాటిని కంచెకు అల్లించే ఏర్పాట్లు చేపట్టారు.

Updated Date - Jul 19 , 2026 | 01:30 AM