Share News

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిపై మదనపల్లె తాలూకా సీఐ దాడి

ABN , Publish Date - May 27 , 2026 | 01:13 AM

గంగ జాతర చూసేందుకు స్వగ్రామానికి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిపై మదనపల్లె తాలూకా సీఐ కె.కళావెంకట్రమణ దురుసుగా ప్రవర్తించారు. అందరూ చూస్తుండగానే బూటుకాలితో తన్ని అవమానించాడు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిపై మదనపల్లె తాలూకా సీఐ దాడి
సీఐతో గొడవపడుతున్న ఆందోళనకారులు

సీఐ తీరుకు నిరసనగా ధర్నా, రాస్తారోకో

మదనపల్లె క్రైం, మే 26 (ఆంధ్రజ్యోతి): గంగ జాతర చూసేందుకు స్వగ్రామానికి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిపై మదనపల్లె తాలూకా సీఐ కె.కళావెంకట్రమణ దురుసుగా ప్రవర్తించారు. అందరూ చూస్తుండగానే బూటుకాలితో తన్ని అవమానించాడు. ఇది చూసిన గ్రామస్తులందరూ సీఐ తీరుకు నిరసనగా వేంపల్లి క్రాస్‌ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. మండలంలోని వేంపల్లెకు చెందిన పోస్ట్‌మెన్‌ వెంకట్రమణనాయుడి కుమారుడు వి.శ్రీనివాసులునాయుడు(25) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. మంగళ, బుధవారం ఊరిలో జరిగే గంగజాతరకు వచ్చాడు. స్నేహితులు, బంధువులతో గడుపుతుండగా సీఐ సిబ్బందితో అక్కడికి చేరుకుని శ్రీనివాసులు నాయుడిపై పలువురు ఫిర్యాదు చేశారని, విచారణకు రావాలని ఆదేశించారు. తాను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినని, తాను శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేయలేదని శ్రీనివాసులు బదులిచ్చాడు. దీంతో ఆగ్రహావేశానికి గురైన సీఐ తనకే ఎదురు చెబుతావా అంటూ శ్రీనివాసులు చొక్కా పట్టుకుని బూటుకాలితో తన్నుతూ దాడి చేశారు. ఇది గమనించిన బంధువులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో వేంపల్లెక్రా్‌సకు చేరుకుని జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. ఒకటిన్నర గంటపాటు ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న సీఐ సిబ్బందితో కలసి అక్కడికి చేరుకోవడంతో ఆందోళనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. సీఐ డౌన్‌..డౌన్‌ అంటూ పెద్దయెత్తున నినాదాలు చేస్తూ ఆయనతో గొడవకు దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు సీఐపై దాడికి యత్నించారు. పోలీసులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎవరెన్ని చెప్పినా లెక్కచేయకుండా పోలీసులను చుట్టుముట్టి తిరగబడ్డారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఏదైనా ఫిర్యాదు వస్తే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని స్టేషన్‌కి పిలిచి విచారించాలని, సామాన్య పౌరుడిని బూటుకాలితో తన్నే అధికారం ఎవరిచ్చారు అని ఎమ్మెల్యే సీఐని గట్టిగా ప్రశ్నించారు. వ్యవహారశైలి మార్చుకోవాలని మందలించారు. దీంతో సీఐ ‘ఏం చేసుకుంటావో నీ చేతనైంది చేసుకోండి. ఈ స్టేషన్‌ కాకపోతే రాయలసీమలో ఎన్నో స్టేషన్లు ఉన్నాయి’ అంటూ ఎమ్మెల్యేతో వ్యంగ్యంగా మాట్లాడారు. సీఐ ఎమ్మెల్యేపై తిరగబడటంతో ఆందోళనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయి ఆయన కాలర్‌ పట్టుకుని రోడ్డుపక్కకు ఈడ్చుకెళ్లారు. ఎమ్మెల్యే సర్దిచెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఆందోళనకారులతో కలసి ఎమ్మెల్యే నేరుగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీఐ ప్రవర్తన సరిగా లేదని, ప్రైవేటు సెటిల్మెంట్లు చేస్తూ సామాన్య ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని పేర్కొన్నారు. ఆయన సస్పెండ్‌కు ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - May 27 , 2026 | 01:13 AM