మదనపల్లె, పరిసర గ్రామాల్లో జాతరల సందడి
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:17 AM
మదనపల్లె పట్టణం, రూరల్‌లో పలుచోట్ల బుధవారం గంగమ్మ జాతరలు అత్యంత వైభవంగా జరిగాయి.
మదనపల్లె అర్బన్, జూన్ 10(ఆంధ్రజ్యోతి): మదనపల్లె పట్టణం, రూరల్‌లో పలుచోట్ల బుధవారం గంగమ్మ జాతరలు అత్యంత వైభవంగా జరిగాయి. ఎస్బీఐ కాలనీలోని మహమ్మారమ్మ ఆలయంలో మంగళవారం సాయంత్రం అమ్మవారిని విశేషంగా అలంకరించి, రాత్రి ప్రతిష్ఠించారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు దీలు, బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. పగలు తిరునాళ్ల ఘనంగా నిర్వహించారు. అలాగే నీరుగట్టువారిపల్లె నడివీధి గంగమ్మను మంగళవారం రాత్రి నడివీధిలో ప్రతిష్ఠించారు. మహిళలు దీలు, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం పగలు తిరునాళ్ల నిర్వహించారు. రూరల్‌లోని పొన్నూటిపాలెం గ్రామం రామిరెడ్డిగారిపల్లెలో ముత్యాలమ్మకు మంగళవారం రాత్రి విశేష పూజలు చేసి, ప్రత్యేక వాహనంపై ఊరేగించారు. మహిళలు చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, పొంగళ్లు నైవేద్యంగా పెట్టారు. దీలు, బోనాలు సమర్పించారు. జంతు బలులు సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో జనసేన రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరాం చినబాబు, రైతు సంఘం రాష్ట్ర నేత రఘునాథరెడ్డి, మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు జంగాలశివరాం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్రకుమార్‌రెడ్డి, ఎంఎన్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.