Share News

‘స్థానిక’ ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధం

ABN , Publish Date - Oct 16 , 2026 | 01:58 AM

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైందని కలెక్టర్‌ డాక్టర్‌ సలిజామల వెంకటేశ్వర్‌ వెల్లడించారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌లో ఎస్పీ సుబ్బరాయుడుతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు.

 ‘స్థానిక’ ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధం

ప్రశాంతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

‘మున్సిపల్‌’ పరిధిలో కోడ్‌ అమలు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

సీసీ కెమెరాలు, డ్రోన్లతో భద్రతపై నిఘా..

నామినేషన్‌, పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

వెల్లడించిన కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు

తిరుపతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైందని కలెక్టర్‌ డాక్టర్‌ సలిజామల వెంకటేశ్వర్‌ వెల్లడించారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌లో ఎస్పీ సుబ్బరాయుడుతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలను ప్రశాతంగా, పారదర్శకంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కట్టుబడి వుందని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, ఎన్నికల సామగ్రి, భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ ఇతర మౌళిక సదుపాయాలకు సంబంధించి సమగ్ర ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం తొలుత మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. తిరుపతి కార్పొరేషన్‌తో పాటు పుత్తూరు, వెంకటగిరి, సూళ్ళూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందన్నారు. ఈ నగర, పట్టణ స్థానిక సంస్థలకు ఈనెల 16, 17, 18 తేదీల్లో ఉదయం 11 నుంచీ మధ్యాహ్నం 3 వరకూ నామినేషన్ల స్వీకరణ వుంటుందన్నారు. మేయర్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌, కార్పొరేటర్లు, కౌన్సిలర్‌ పదవులకు వేర్వేరుగా నామినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అభ్యర్థులు ముందుగానే నామినేషన్‌ కేంద్రాల వివరాలు తెలుసుకుని సకాలంలో నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. మధ్యాహ్నం 3 తర్వాత దాఖలయ్యే నామినేషన్లను స్వీకరించేది లేదని స్పష్టం చేశారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద కూడా సీసీ టీవీ కెమెరాలు, వీడియో కవరేజ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి ప్రతి నామినేషన్‌ కేంద్రం వద్ద హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. 19న నామినేషన్ల పరిశీలన, 21న ఉపసంహరణల గడువు పూర్తయ్యాక అదే రోజు పోటీలో వున్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. 28న పోలింగ్‌ నిర్వహిస్తామని, దానికి 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలును పర్యవేక్షించేందుకు ఫ్లైయింగ్‌ స్వ్కాడ్‌లు, స్టాటిక్‌ సర్వైలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈనెల 18న నోటిఫికేషన్‌ ఇస్తామని, అలాగే గ్రామపంచాయతీకుల మూడు విడతల్లో నోటిఫికేషన్లు జారీ చేస్తామని వివరించారు. దానికనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందన్నారు. స్థానిక సంస్థల పదవులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల జనాభా గణాంకాలు, రిజర్వేషన్‌ నిబంధనలు, రొటేషన్‌ విధానాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేశామన్నారు. కలెక్టరేట్‌, జిల్లా పంచాయతీ కార్యాలయం, జిల్లా పోలీస్‌ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయాలు, మండల స్థాయిల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తామని, ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలు 20వ తేదీ వరకు వున్నందున ఎన్నికల విధులతో పాటు ఉత్సవాల నిర్వహణకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావు లేకుండా ప్రశాతం వాతావరణంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, అబ్యర్థులు, ప్రజలూ సహకరించాలని కోరారు.

భయాందోళనలు వీడి ప్రజలు స్వేచ్ఛగా ఓటింగ్‌లో పాల్గొనాలి: ఎస్పీ

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని ఎలాంటి భయాందోళనలకూ గురి కాకుండా స్వేచ్ఛగా ఓటింగ్‌లో పాల్గొనాలని ఎస్పీ సుబ్బరాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని శాఖల సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సమన్వయంతో పనిచేస్తామన్నారు. నామినేషన్ల ప్రక్రియతో పాటు పోలింగ్‌ ముందు, పోలింగ్‌ రోజు, ఆ తర్వాత చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై సమగ్రంగా ప్రణాళిక రూపొందించామన్నారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్లను కూడా వినియోగించి భద్రతను పటిష్టం చేస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియలో చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అవసరమైన భద్రతా చర్యలు చేపడతామన్నారు. రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించి పోలీసు, ఎన్నికల అధికారులకు సహకరించాలని ఎస్పీ కోరారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావు, డీఆర్వో నరసింహులు కూడా పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 01:58 AM