Share News

మాటల్లో దింపి.. గొలుసు తెంపి..

ABN , Publish Date - Aug 19 , 2026 | 01:30 AM

చైన్‌స్నాచర్స్‌ వరుస చోరీలకు పాల్పడుతూ జనాలను బెంబేలెత్తిస్తున్నారు. ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో నెలరోజుల్లో నాలుగు చోరీలు చేశారు. మరో మూడు విఫలయత్నమయ్యాయి.

 మాటల్లో దింపి.. గొలుసు తెంపి..

ఒంటరి మహిళలే టార్గెట్‌

నిందితులంతా యువకులే

మదనపల్లె క్రైం, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): చైన్‌స్నాచర్స్‌ వరుస చోరీలకు పాల్పడుతూ జనాలను బెంబేలెత్తిస్తున్నారు. ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో నెలరోజుల్లో నాలుగు చోరీలు చేశారు. మరో మూడు విఫలయత్నమయ్యాయి. ఈ చోరులంతా పాతికేళ్లలోపు వారే కావటం గమనార్హం. విలాసాలు, చెడు వ్యసనాలకు బానిసై గొలుసు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దుండగులు మంకీ క్యాప్‌, హెల్మెట్‌, ముసుగు ధరించి ద్విచక్ర వాహనంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. రోడ్డుపక్కన, ఇళ్లవద్ద నిలబడి ఉండి, రహదారుల్లో నడుచుకుని వెళ్తున్న ఒంటరి మహిళలపై వీరు కన్నేస్తున్నారు. పొలాల వద్ద పనులు చేస్తూ..పశువులు కాస్తున్న వారినీ మోసగిస్తున్నారు. స్నేహితులు, బంధువుల పేరు, చిరునామా, అద్దె ఇళ్ల వివరాలు, ఊళ్ల పేర్లు లాంటి వివరాలు అడుగుతున్నట్లు నమ్మిస్తున్నారు. నిందితుల మాటలు నిజమని భ్రమించిన మహిళలను ఏమరపాటుకు గురి చేస్తున్నారు. అదును గమనించి, వాహనాన్ని రన్నింగ్‌లో పెట్టి మహిళ మెడలోని బంగారు గొలుసులు లాక్కొని క్షణాల్లో ఉడాయిస్తున్నారు. బాధితులు కేకలు వేసేలోపే దుండగులు వెళ్లిపోతున్నారు. 20 నుంచి 60గ్రాముల బరువు ఉన్న బంగారు గొలుసులనే చోరులు లాక్కెళ్తున్నారు.

పోలీసుల నుంచి సవాలక్ష ప్రశ్నలు

మదనపల్లె పట్టణం, రూరల్‌, కురబలకోట, బి.కొత్తకోట, నిమ్మనపల్లె, వాల్మీకిపురం, తంబళ్లపల్లె ప్రాంతాల్లో ఇటీవల గొలుసు చోరీలు పెరిగాయి. ఇందులో కొన్ని పోలీస్‌ స్టేషన్లలో నమోదు కాగా, మరికొన్ని రికార్డులకెక్కడంలేదు. మహిళల అవగాహనా రాహిత్యాన్నే పోలీసులు ఎత్తిచూపుతున్నారు. ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయకుండా స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని బాధితులు వాపోతున్నారు. నేతల సిఫారసుతో బలవంతంగా ఫిర్యాదు తీసుకుని సవాలక్ష ప్రశ్నలు అడుగుతున్నారని వీరు ఆవేదన చెందుతున్నారు. అన్ని గ్రాముల గొలుసు ఎందుకు వేసుకున్నావ్‌, ఎప్పుడు.. ఎక్కడ కొన్నావు.. ఖరీదు ఎంత, రసీదులు తీసుకురమ్మని చెప్పడంతో ఫిర్యాదుదారులు విస్తుపోతున్నారు. గొలుసు పోగొట్టుకొని కూడా పోలీసులతో మాటలు పడాల్సి వస్తోందని లోలోపల బాధపడుతున్నారు.

ఇటీవల జరిగిన చోరీలు..

ఫ ఈనెల 11న మదనపల్లెలోని శేష్‌మహాల్‌ థియేటర్‌ ఏరియాకు చెందిన మనోహరమ్మ ఇంటి వద్ద నిలబడి ఉండగా, గుర్తుతెలియని ఓ యువకుడు మంకీ క్యాప్‌ పెట్టుకుని ద్విచక్రవాహనంలో వచ్చాడు. మాటలు కలిపి మెడలోని 25గ్రాముల బంగారు గొలుసు లాక్కెళ్లిపోయాడు.

ఫ ఈనెల 13న బి.కొత్తకోట మండలం యర్రమద్దువారిపల్లెకు చెందిన బయమ్మ పొలం వద్దకు నడుచుకుని వెళ్తుండగా ఓ యువకుడు హెల్మ్‌ట్‌ ధరించి బైక్‌లో వచ్చాడు. ఆ ఊరికి దారెటు అని అడుగుతూ మెడలోని 30గ్రాముల బంగారు గొ లుసు చోరీ చేసి పారిపోయాడు.

ఫ అదేరోజు మదనపల్లెలో రెడ్డెమ్మ కూలిపనులకు వెళ్తుండగా, ఇద్దరు యువకులు ముసుగు ధరించి ద్విచక్రవాహనంలో వచ్చారు. స్నేహితుడి ఇంటి అడ్రస్‌ అడుగుతున్నట్లు నటించి ఆమె మెడలోని 20గ్రాముల గొలుసు పట్టి లాగారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో వేగంగా వెళ్లిపోయారు.

ఫ ఈనెల 14న నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లెకు చెందిన రాధారాణి పొలం వద్దకు నడుచుకుని వెళ్తుండగా ఓ యువకుడు మాస్క్‌ ధరించి బైక్‌లో వచ్చాడు. మెడలోని బంగారు గొలుసు చోరీ చేసేందుకు ప్రయత్నించగా, ఆమె చేతిలోని కొడవలితో దాడి చేయడంతో దుండగుడు పారిపోయాడు.

ఫ ఈనెల 15న మదనపల్లె మండలం తట్టివారిపల్లె బైపా్‌సరోడ్డులో ఓ మహిళ ఆటో కోసం వేచి ఉండగా ఓ యువకుడు ముసుగు ధరించి ద్విచక్రవాహనంలో వ చ్చాడు. మాట్లాడుతూ మెడలోని గొలుసు చోరీకి యత్నించాడు. ఆమె బిగ్గరగా కే కలు వేయడంతో దుండగుడు వేగంగా పారిపోయాడు.

మహిళలు అప్రమత్తంగా ఉండాలి

గొలుసు చోరీలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలి. మంకీ క్యాప్‌, ముసుగు, హెల్మెట్‌ ధరించిన వ్యక్తులు దగ్గరకు వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా కాకుండా జనాల్లోకి వెళ్లాలి. అనుమానితులు, గుర్తుతెలియని వ్యక్తుల సంచారంపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. గొలుసు చోరీలపై స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి. చైన్‌స్నాచర్స్‌ కదలికలపై నిఘా ఉంచాం. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నాం.

దుండగులను అరెస్ట్‌ చేసి సొత్తు రికవరీ చేస్తాం.

- ధీరజ్‌, ఎస్పీ

Updated Date - Aug 19 , 2026 | 01:30 AM