చాక్లెట్లు, బిస్కెట్లు ఆశచూపి...!
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:25 AM
అభంశుభం తెలియని చిన్నారులు. ఒకరికి ఐదేళ్లు, మరొకరికి మూడేళ్లు. తాత వయసున్న ఓ వృద్ధుడు చాకెట్లు, బిస్కెట్లు ఆశచూపి లైంగిక దాడికి యత్నించాడు.
- ఇద్దరు చిన్నారులపై వృద్ధుడు లైంగిక దాడికి యత్నం
- పోక్సో చట్టం కింద కేసు నమోదు
ములకలచెరువు, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): అభంశుభం తెలియని చిన్నారులు. ఒకరికి ఐదేళ్లు, మరొకరికి మూడేళ్లు. తాత వయసున్న ఓ వృద్ధుడు చాకెట్లు, బిస్కెట్లు ఆశచూపి లైంగిక దాడికి యత్నించాడు. స్థానికుల కథనం మేరకు... మండలంలోని ఓ గ్రామానికి చెందిన భార్యాభర్తలు కూలి పనుల కోసం నాలుగేళ్ల క్రితం కర్ణాటక రాష్ర్టానికి వెళ్లారు. వీరి ఇద్దరు కుమార్తెలు గ్రామంలోని నానమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటున్నారు. శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో చిన్నారులకు అవ్వ డబ్బు ఇచ్చి దుకాణానికి వెళ్లి తినుబండారాలు తినమని చెప్పింది. దుకాణం వద్ద అదే గ్రామానికి చెందిన మహబూబ్‌సాబ్(60) మద్యం మత్తులో ఉన్నాడు. చిన్నారులకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తానని ఆశచూపి పక్కనే ఉన్న పాడుబడ్డ గోదాములోకి తీసుకెళ్లాడు. అసభ్యకరంగా తాకుతూ లైంగికంగా వేధించసాగాడు. మనవరాళ్లు ఎంతకీ రాకపోవడంతో అవ్వ వారి పేర్లు పిలుస్తూ వెళ్లింది. ఆమె కేకలు విన్న వృద్ధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. జరిగిన విషయాన్ని చిన్నారులు అవ్వకు చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దస్తగిరి తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని చిన్నారుల కుటుంబీకులు, బంధువులు కోరారు.