దశకంఠుడిపై పరమశివుడి విహారం
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:21 AM
శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో శుక్రవారం రాత్రి జగద్రక్షకుడైన పరమశివుడు రావణవాహనంపై అధిరోహించి పురవిహారం చేశారు.
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో శుక్రవారం రాత్రి జగద్రక్షకుడైన పరమశివుడు రావణవాహనంపై అధిరోహించి పురవిహారం చేశారు. ఆయన పక్కనే జ్ఞానప్రసూనాంబ మయూర వాహనంపై ముందుకుసాగారు.ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు బంగారు హంస వాహనంపై... జ్ఞానప్రసూనాంబ బంగారు యాళివాహనంపై పురవీధుల్లో ఊరేగారు.ముందు మూషికవాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప పరివారం సాగింది.కళాకారుల కోలాటాల నడుమ, శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. చతుర్మాడ వీధుల్లో బంగారు వాహనాలపై ఊరేగుతున్న శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ చైర్మన్ కొట్టే సాయి, ఈవో బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.