వైనతేయుడిపై వైకుంఠనాథుడు
ABN , Publish Date - Sep 20 , 2026 | 01:13 AM
అంగరంగ వైభవంగా గరుడసేవ అందరికీ సంతృప్తికరమైన దర్శనం
తిరుపతి(టీటీడీ)/తిరుమల, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి గరుడసేవ అంగరంగ వైభవంగా సాగింది. మలయప్పస్వామి తనకు ఎంతో ప్రీతిపాత్రుడైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు. సాధారణంగా వాహన సేవలు రాత్రి ఏడు గంటల నుంచి ప్రారంభమవుతాయి. అయితే గ్యాలరీల్లో ఉన్న ప్రతి భక్తుడికీ వినుతి పుత్రుడు గరుడుడిపై విహరిస్తున్న శ్రీవారి దర్శనభాగ్యం కల్పించాలన్న ఉద్దేశంతో సాయంత్రం 6.25 గంటలకే వాహన సేవను ప్రారంభించారు. జీయంగార్ల ఘోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించుకున్నారు. గరుడ సేవను తిలకించేందుకు శుక్రవారం రాత్రి నుంచే భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఉదయం మోహినీ అవతార వాహన సేవ సమయానికే మాడవీధుల్లోని గ్యాలరీలు చాలావరకూ నిండిపోయాయి. అటు శ్రీవారి సేవాసదన్ ప్రాంతం వద్ద వారధి పైనుంచి ఇటు వరాహస్వామి ఆలయం ముందున్న గ్యాలరీల్లోకి భక్తులను అనుమతించారు. దీనివల్ల రహదారిపైన ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు గ్యాలరీలన్నీ నిండిన తర్వాత సాయంత్ర సమయంలో రహదారులపై వాహన సేవను తిలకించేందుకు ఎదురుచూస్తున్న భక్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇనుప ఫెన్సింగ్ దారిలోకి తీసుకున్నారు. వసంతమండపం, ఎస్వీ మ్యూజియం, మేదరమిట్ట, తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం ప్రాంతాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫెన్సింగ్‌ల నుంచి వీరికి వాహనాన్ని దర్శించుకునే అవకాశం కల్పించారు. సాధారణంగా గ్యాలరీల్లో ఉన్న భక్తులు మాత్రమే నేరుగా వాహన సేవలను తిలకిస్తూ వచ్చేవారు. అయితే అధిక సంఖ్యలో భక్తులు వాహనసేవను తిలకించేలా వాహనానికి ఇరువైపులా తాళ్లను ఏర్పాటు చేశారు. వాహనం పక్కన ఏర్పాటు చేసిన తాళ్ల మధ్య నుంచి భక్తులు పెద్దసంఖ్యలో మలయప్పస్వామిని దర్శించుకున్నారు.దాదాపు 2వేల మంది శ్రీవారిసేవకులు, 600 మంది సిబ్బంది భక్తులకు సేవలందించారు. అలాగే తిరుమలలోని ఎనిమిది ప్రాంతాల్లో సెక్టోరల్ అధికారులు 24 గంటలపాటు ఏర్పాట్లను పర్యవేక్షించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవోలు శరత్, గోపీనాథ్ ఎప్పటికప్పుడు అధికారులతో కలిసి భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. మరోవైపు సమర్థవంత ప్రణాళికలతో భక్తులకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించే విషయంలో ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణ కృషి చేశారు.