సర్వభూపాలుడిపై సప్తగిరీశుడు
ABN , Publish Date - Sep 19 , 2026 | 01:50 AM
కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహనంతో పాటు సర్వభూపాల వాహనంలో ఊరేగి మలయప్పస్వామి భక్తకోటిని అనుగ్రహించాడు.
కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహనంతో పాటు సర్వభూపాల వాహనంలో ఊరేగి మలయప్పస్వామి భక్తకోటిని అనుగ్రహించాడు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు ఉదయం శ్రీవారి ఆలయంలో ఉదయం శాస్త్రోక్త పూజలు, విశేష సమర్పణ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఆలయం వెలుపలకు మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. అప్పటికే వాహన మండపంలో సిద్ధం చేసిన కల్పవృక్ష వాహనంలో గోవులపై గోపన్న అలంకారంలో అధిష్ఠింపజేసి మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి సర్వభూపాల వాహనసేవలో గజేంద్రమోక్షం అలంకారంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.గజరాజులు, అశ్వాలు, భజన బృందాలు, కోలాటాలు, జీయంగార్ల గోష్టి ముందు సాగుతుండగా ఆహ్లాదరమైన వాతావరణంలో మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, కర్పూర హారతులు, గోవిందనామస్మరణల మధ్య వాహనసేవలు కనులపండువగా జరిగాయి.
- తిరుమల, ఆంధ్రజ్యోతి