లద్దిగం చెరువు లూటీ
ABN , Publish Date - Jul 18 , 2026 | 01:45 AM
ఇసుక, తుమ్మ చెట్ల విక్రయాల్లో భారీ అక్రమాలు రూ.కోటి విలువ చేసే 2వేల తుమ్మచెట్లు రూ.2.77లక్షలకే ఖరారు చెరువు వనరుల ఆదాయాన్ని పంచుకున్న వైసీపీ, టీడీపీ నేతలు
చౌడేపల్లె, జూలై 17(ఆంధ్రజ్యోతి): మండలంలో అతిపెద్దదైన 800 ఎకరాల విస్తీర్ణం గల లద్దిగం చెరువు భారీ ఎత్తున లూటీకి గురైంది. టీడీపీ, వైసీపీ నేతలు కలిసి అధికారుల భాగస్వామ్యంతో యథేచ్ఛగా ఇసుక, నల్లతుమ్మ చెట్లను దోపిడీ చేశారు. కనీసం ఆయకట్టు రైతులకు, సాగునీటి సంఘం డైరెక్టర్లకు విషయం తెలియకుండా రహస్యంగా పని కానిచ్చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ఇసుకను కర్ణాటక, ఇతర ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుత కూటమి పాలనలో అంతకంటే ఎక్కువగానే తరలించడంతో చెరువు రూపు కోల్పోయింది. ప్రస్తుతం నెల్లూరుకు చెందిన వైసీపీ నేతతో కలసి స్థానిక టీడీపీ నాయకులు కొన్ని నెలల పాటు కోట్ల రూపాయల విలువ చేసే ఇసుక అక్రమంగా తవ్వి విక్రయించేశారు. టీడీపీ, వైసీపీ నేతలు లద్దిగం చెరువు ద్వారా అక్రమంగా సుమారు 50 కోట్లకు పైగానే దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. 80 అడుగులలోతు వరకు ఇసుక గుంటలు ఏర్పడటంతో చెరువు ప్రమాదకరంగా మారుతోందని రైతులు, గ్రామస్తులు ఇసుక తరలింపును అడ్డుకున్నారు. గత ఏడాది ఇసుక అక్రమంగా తవ్వుతున్న వ్యక్తులకు చిత్తూరు కలెక్టర్ సుమిత్‌కుమార్ రూ.6 లక్షలు జరిమానా విధించి, బావులను తలపిస్తున్న గుంతలను పూడ్చాలని ఆదేశించారు. అయితే ఇసుకాసురులు జరిమానా మాత్రం చెల్లించి కలెక్టర్ ఆదేశాలను ఖాతరు చేయకుండా గుంతలు పూడ్చకుండానే వదిలేశారు. 80 ఆడుగుల లోతు ఉన్న గుంతల వల్ల చెరువులో చుక్క నీరు నిల్వ లేకుండా నిరుపయోగంగా మారింది. చెరువు ద్వారా కోట్ల రూపాయలు అర్జించిన రాజకీయ నాయకులు దాని అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
రూ.కోటి విలువైన 2వేల తుమ్మ చెట్లు రూ.2.77 లక్షలకే..!
చెరువులోని రూ.కోటి విలువ చేసే నల్లతుమ్మ చెట్లను బహిరంగ వేలం లేకుండా, కనీసం చెరువు నీటిసంఘ కార్యవర్గానికి కూడా సమాచారం ఇవ్వకుండా వైసీపీ నాయకులు గత ఏడాది కూటమి నేతలతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని తూతూ మంత్రంగా రహస్యంగా కాగితాల్లో వేలం పాటలు నిర్వహించారు. గత ఏడాది డిసెంబరు రెండో తేదీ అక్రమంగా ఓ వ్యక్తికి కేవలం రూ.2,77,830కు వేలంలో కట్టబెట్టినట్లు గ్రామపంచాయతీ రికార్డులో చూపించారు. ఒక్కొక్క తుమ్మచెట్టు రూ.4 వేలు నుంచి రూ.8 వేలు వరకు విలువ చేస్తుండగా చెట్టును సరాసరిగా కేవలం రూ.280 చొప్పున అధికారులు విలువకట్టారు. గత ఏడాది వర్షం కారణంగా తుమ్మ చెట్లు కోయలేదు. కారుచౌకగా తుమ్మచెట్లు ద క్కించుకున్న వ్యక్తి మరో వ్యక్తికి చెట్లను రూ.46 లక్షలకు విక్రయించినట్లు తెలిసింది. చిత్తూరు డీఎ్‌ఫవో కార్యాలయంలో 1000 చెట్లు కటింగ్ చేయడానికి అనుమతి కోసం అటవీశాఖకు గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీ రూ.4లక్షలు చలానా కట్టారు. పేరుకు మాత్రమే 1000 చెట్లు కటింగ్ ఆర్డర్ తీసుకుని సుమారుగా 2000 చెట్లు రూ.కోటి కంటే ఎక్కువ విలువ చేసే చెట్లను నరికి తమిళనాడు, తదితర ప్రాంతాలకు తరలించి విక్రయించారు. తూతూమంత్రంగా నిర్వహించిన వేలం ధరకు చెరువులో అక్రమంగా కొట్టుకున్న చెట్లుకు భారీ వ్యత్యాసం ఉండగా సుమారు రూ.80 లక్షల పైచిలుకుగా అనధికారికంగా వసూళ్లు జరిగినట్లు తెలిసింది. ఈ అక్రమ నిధులను వైసీపీ, టీడీపీ నాయకులు, కొందరు అధికారులు కలిసి వాటాలు వేసుకున్నారు. అయితే వాటాలు కుదరక ఇటీవల ఓ వైసీపీ మాజీ ప్రజాప్రతినిధి ఇంట్లో రహస్య పంచాయతీ బెడిసికొట్టి వాగ్వాదాలు, కొట్టుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తుమ్మచెట్ల వేలంపై విచారణ జరిపించాలి
చెరువులో నల్లతుమ్మ చెట్ల లెక్కింపు, వేలం వేసిన తీరు, అనధికార వసూళ్లు, అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ నిశాంత్‌కుమార్ విచారణ జరిపిస్తే పలు విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయకట్టు రైతులు అంటున్నారు. జలభద్రతలో భాగంగా చెరువును బాగు చేయాలని కోరుతున్నారు. ఈ చెరువు ద్వారా లద్దిగం, పుదిపట్ల, తిరుణంపల్లె, అంకుతోటపల్లె, కొత్తపల్లె, కొత్తకోట, నల్లూరుపల్లె, బండ్లపల్లెతో పాటు పలు గ్రామాల ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. అక్రమార్కుల చొరబాటుతో చెరువులో చుక్క నీరు లేకుండా పోయింది. తద్వారా 12 గ్రామాల ఆయకట్టు రైతులు 1,300 ఎకరాలకు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు.
చెరువును చెరబట్టారు
లద్దిగం చెరువు వద్ద మాకు 2 ఎకరాల పొలం ఉంది. నాలుగేళ్ల క్రితం వరకు నీరు పుష్కలంగా ఉండటంతో పంటలు వేసేవాళ్లం. ఇసుక తవ్వకాలతో నీరులేకుండా పోయాయి. చెరువులో విలువైన తుమ్మ చెట్లను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేలం వేశారు. ఇందులో చాలామందికి వాటాలున్నాయి. చెరువు అభివృద్ధిని ఎవరూ పట్టించుకోవడం లేదు.
- వినోద్‌కుమార్‌రెడ్డి, ఆయకట్టు రైతు, పుదిపట్ల
చెట్ల వేలంపై సమాచారం లేదు
ఎవరికీ సమాచారం ఇవ్వకుండా చెరువులో 2వేల తుమ్మ చెట్లు కోసేసి అమ్ముకున్నారు. రూ.కోటి విలువైన చెట్లు కేవలం రూ.2.77లక్షలకు ఇచ్చేశామంటున్నారు. ప్రభుత్వానికి రూ.కోటిపైనే నష్టం వచ్చేలా కొందరు వ్యక్తులు వ్యవహరించారు. సోమవారం కలెక్టర్ నిశాంత్‌కుమార్‌కు ఫిర్యాదు చేస్తాం. చెరువు అభివృద్ధికి విన్నవిస్తాం.
- వేణుగోపాల్‌రెడ్డి, చెరువు సాగునీటి సంఘం డైరెక్టర్, బండ్లపల్లె