Share News

ముంచుకొస్తున్న నీటి ఎద్దడి

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:24 AM

ఎల్‌నినో ప్రభావంతో ఎన్నడూ లేనంతగా ఎండలు. ముఖం చాటేసిన నైరుతి రుతుపవనాలు. అడుగంటుతున్న భూగర్భ జలాలు.. చెరువులు.. రిజర్వాయర్లు. వీటి ప్రభావంతో చిత్తూరు నగర ప్రజలకు నీటి ఎద్దడి ముంచుకొస్తోంది.

ముంచుకొస్తున్న నీటి ఎద్దడి
అడుగంటుతున్న ఎన్టీయార్‌ జలాశయం

ఎల్‌నినో ప్రభావంతో ఎన్నడూ లేనంతగా ఎండలు. ముఖం చాటేసిన నైరుతి రుతుపవనాలు. అడుగంటుతున్న భూగర్భ జలాలు.. చెరువులు.. రిజర్వాయర్లు. వీటి ప్రభావంతో చిత్తూరు నగర ప్రజలకు నీటి ఎద్దడి ముంచుకొస్తోంది. ఎన్టీఆర్‌ జలాశయం నుంచి వచ్చే నీళ్లే ఆధారం. జలాశయంలోని నీళ్లు మరో 20 రోజుల్లో అడుగంటే ప్రమాదముంది. ఆ లోపు వర్షాలు పడకపోతే ట్యాంకర్ల ద్వారా నీరందించాల్సి వస్తోంది.

- చిత్తూరు అర్బన్‌, ఆంధ్రజ్యోతి

చిత్తూరు నగర ప్రజల అవసరాలకు బోర్లు.. ఎన్టీఆర్‌ జలాశయం నీళ్లపైనే ఆధారపడుతుంటారు. మామూలుగా అయితే ఈ పాటికే ఓ మోస్తరు వర్షాలు పడేవి. భూగర్భజలమట్టం పెరిగి నీటి ఎద్దడి రాకుండా ఉండేది. ఎల్‌నినో ప్రభావంతో కొంతకాలంగా ఎండలు పెరిగాయి. సకాలంలో రావాల్సిన నైరుతి రుతుపవనాలు ముఖం చేశాయి. దీంతో జిల్లాలో ఆశించినంతగా వర్షాలు పడలేదు. వీటి ప్రభావంతో బోర్లతోపాటు ఎన్టీఆర్‌ జలాశయంలోని నీటి మట్టం కూడా రోజు రోజుకూ తగ్గిపోతోంది. చిత్తూరు, చుట్టుపక్కలా మండలాల్లో వర్షాలు కురవకపోయినా పడమటి మండలాలైన బంగారుపాళ్యం, పలమనేరు. బైరెడ్డిపల్లె, పెద్దపంజాణి, గంగవరం, కల్లూరు, పాకాల, పూతలపట్టు, ఐరాల మండలాల్లో వర్షాలు పడినా.. ఆ నీళ్లంతా కాలువల ద్వారా ఎన్టీఆర్‌ జలాశయానికి వచ్చేవి. అక్కడ కూడా వర్షాలు కురవకపోవడంతో జలాశయ నీటిమట్టం తగ్గిపోతోంది. నగరంలోని బోర్ల నుంచి ఇప్పటికీ నీరు వస్తున్నప్పటికీ ఇదే విధంగా ఎండలు కాస్తే... వీటి నీటిమట్టం తగ్గిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎక్కడెక్కడ నుంచి ఎంత నీరిస్తున్నారు..

చిత్తూరు ప్రజలకు రోజుకు 27.5 ఎంఎల్‌డీ నీళ్లు అవసరం. ఇందులో ఎన్టీఆర్‌ జలాశయం నుంచి 8 ఎంఎల్‌డీ, పూనేపలె ్ల వద్ద ఉన్న బోరుబావుల నుంచి 0.8ఎంఎల్‌డీ, మున్సిపల్‌ ట్యాంకర్లు, అద్దె ట్యాంకర్ల నుంచి 0.42 ఎంఎల్‌డీల నీటిని అందిస్తునారు. వీటన్నింటి ద్వారా నీటిని సరఫరా చేసినప్పటికీ రోజుకు 4.58 ఎంఎల్‌డీల నీటిని తక్కువగా ఇస్తున్నారు. ఒకవేళ ప్రజలకు అవసరానికి తగినంతగా జలాశయం నుంచి నీటిని ఇచ్చివుంటే ఈ పాటికే అక్కడి నీళ్లు అడుగంటిపోయేవి. ముందస్తు జాగ్త్రత్త చర్యల్లో భాగంగా ఒక వ్యక్తి రోజుకీ 135లీటర్ల నీటిని ఇవ్వాల్సి ఉండగా 50 లీటర్ల నీటిని కూడా ఇవ్వడం లేదు.

ఎన్టీఆర్‌ జలాశయంలో నీరెంత తగ్గింది?

ఎన్టీఆర్‌ జలాశయాన్ని 108 నుంచి 110 ఎంసీఎ్‌ఫటీ (మిలియన్‌ క్యూబిక్‌ అడుగులు) నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. అంటే దాదాపు 0.11 టీఎంసీలు. గత కొన్ని నెలలుగా కాస్తున్న ఎండలతో పాటు గాలి ప్రభావంతో నీటిలోని తేమశాతం గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 40 ఎంపీఎ్‌ఫటీల నీళ్లు మాత్రమే నిల్వ ఉందని ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. ఎండలు ఇలాగే కొనసాగితే మరో 25-30 రోజుల్లో జలాశయంలో నీరు అడుగంటిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు.

ఇప్పటికే 4.58 ఎంఎల్‌డీ తక్కువగా సరఫరా

చిత్తూరు నగర జనాభా 2.03 లక్షలు. నిబంధన ప్రకారం ఒక వ్యక్తికి రోజుకు 135లీటర్ల నీటిని సరఫరా చేయాలి. ఈ లెక్కన రోజుకు నగరపాలకసంస్థలోని 50 డివిజన్లకు ఎన్టీఆర్‌ జలాశయం, బోర్ల నుంచి 27.5 ఎంఎల్‌డీల నీటిని అందించాలి. ఇప్పటి వరకు 22.92 ఎంఎల్‌డీల నీటినే ఇస్తున్నారు. ఈ లెక్కన 4.58 ఎంఎల్‌డీల నీటిని ఇవ్వడం లేదు. ఇప్పటికే నగరంలోని 50 బోర్ల వరకు ఎండిపోయాయి. ఎండలు ఇలాగే కొనసాగితే మరిన్ని బోర్లు ఎండిపోవడంతో పాటు జలాశయం కూడా బురద తేలే ప్రమాదం ఉంది. బోర్లు, జలాశయం నుంచి నీటిని తీసుకురావడానికి ఇప్పటికే కరెంటు ఛార్జీల కింద నెలకు రూ. ఒక కోటి వరకు చెల్లిస్తున్నారు. జలాశయం ఎండిపోతే అద్దె ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటికే చేసిన అభివ ృద్ధి పనులకు బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో నగరపాలక సంస్థ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దానికితోడు అద్దె ట్యాంకర్లు పెట్టాల్సి వస్తే.. తలకుమించిన మారే అవకాశం ఉందని నగరపాలక అధికారులు చెబుతున్నారు.

అడవిపల్లె రిజర్వార్‌ పనులు పూర్తయితే..

వర్షాలపైనే ఆధారపడి ఉండే ఎన్టీఆర్‌ జలాశయంలోని నీళ్లు, బోర్ల నుంచి వచ్చే నీరు నగర ప్రజల అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. కొన్నివార్డుల్లో రెండు రోజులు, మరికొన్ని వార్డులకు మూడు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. వీటన్నింటిని గుర్తించిన 2014లో అధికారంలోగా రాగానే రూ.270 కోట్లతో అమృత్‌ పథక కింద అడవిపల్లె నుంచి చిత్తూరుకు పైపులైన్ల ద్వారా నీటిని తీసుకురావడానికి పనులు ప్రారంభించారు. సాంకేతికంగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగించుకుని కొంతవరకు పనులు జరిగాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు పనులను చేపట్టలేదు. తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అడవిపల్లె పైపులైన్‌ పనులపై దృష్టిసారించింది. దాంతో పైపులైన్‌ పనులతో పాటు ఇతర పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌ నీటికి.. అడవిపల్లె రిజర్వాయర్‌ పనులూ పూర్తయితే నగర ప్రజలకు నీటి సమస్య ఉండదు.

Updated Date - Aug 03 , 2026 | 12:24 AM