చుడా.. ఇక సీపీకే ఉడా
ABN , Publish Date - Aug 18 , 2026 | 01:42 AM
జిల్లా మొత్తం ఒకే అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ 28 మండలాలు, 4 మున్సిపాలిటీలు, 774 రెవెన్యూ గ్రామాలు
చిత్తూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (చుడా) స్వరూపం పూర్తిగా మారిపోయింది. జిల్లా పునర్వ్యవస్థీకరణ, పెరుగుతున్న పట్టణీకరణ, భవిష్యత్తు అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం చుడా పరిధిని సమూలంగా మార్చేసింది. ఇకపై చిత్తూరు- పలమనేరు- కుప్పం అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (సీపీకే ఉడా)గా ఇది కొనసాగనుంది. అంటే జిల్లా మొత్తం ఇక నుంచి ఒకే అర్బన్ అథారిటీ కింద ఉంటుంది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
3501 నుంచి 4604 చ.కి.మీల వరకు..
2019లో 3501 చదరపు కిలోమీటర్ల పరిధితో చుడా ఏర్పాటైంది. ఇందులో మున్సిపాలిటీతో పాటు 22 మండలాల్లోని 434 రెవెన్యూ గ్రామాలు ఉండేవి. తాజాగా ప్రభుత్వం చేపట్టిన పునర్వ్యవస్థీకరణతో అథారిటీ పరిధి 4604 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. మండలాల సంఖ్య 22 నుంచి 28కు.. రెవెన్యూ గ్రామాల సంఖ్య 434 నుంచి 774కు చేరింది.
నాలుగు మున్సిపాలిటీలు
గతంలో ఓ మున్సిపాలిటీకే పరిమితమైన అథారిటీ ఇప్పుడు నాలుగు పట్టణ స్థానిక సంస్థలకు విస్తరించింది. కొత్తగా ఏర్పాటుకానున్న సీపీకే ఉడా పరిధిలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, కుప్పం, నగరి మున్సిపాలిటీలుంటాయి.
తుడా నుంచి చేరిక
జిల్లాల పునర్విభజన కారణంగా నగరి మున్సిపాలిటీతో పాటు మండలం, నిండ్ర, విజయపురం, కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలు చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. అయితే, ఇవి తిరుపతి అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (తుడా)లో కొనసాగాయి. ఇప్పుడు తుడాను తిరుపతి జిల్లాకే పరిమితం చేయడంతో, నగరి మున్సిపాలిటీతో పాటు ఆ మండలాలనూ సీపీకే ఉడాలో విలీనం చేశారు.
సీపీకే ఉడాలో మండలాలివీ
పాలసముద్రం, కార్వేటినగరం, నగరి, నిండ్ర, విజయపురం, చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్, గుడిపాల, యాదమరి, జీడీనెల్లూరు, పూతలపట్టు, పెనుమూరు, తవణంపల్లె, ఐరాల, పులిచెర్ల, రొంపిచెర్ల, ఎస్‌ఆర్‌పురం, వెదురుకుప్పం, బంగారుపాళ్యం మండలాలు ఇందులో ఉంటాయి. అలాగే పీకేఎం ఉడాలో ఉన్న పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, బైరెడ్డిపల్లె, వి.కోట, కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం మండలాలు కూడా కొత్త అథారిటీ పరిధిలోకి వస్తాయి.
అన్నమయ్యలోని మండలాల తొలగింపు
గతంలో చుడా పరిధిలో ఉన్న అన్నమయ్య జిల్లాకు చెందిన కొన్ని మండలాలను తాజాగా పునర్వ్యస్థీకరించిన అథారిటీ నుంచి తొలగించారు. దీంతో నిమ్మనపల్లె, చౌడేపల్లె, సదుం, సోమల, కలికిరి, వాల్మీకిపురం, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కేవీపల్లె మండలాల్లోని 167 రెవెన్యూ గ్రామాలు ఇక నుంచి సీపీకే ఉడా పరిధిలో ఉండవు.
పీకేఎం ఉడా.. ఇక అన్నమయ్య ఉడాగా
పలమనేరు- కుప్పం- మదనపల్లె అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (పీకేఎం ఉడా) పేరును అన్నమయ్య అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీగా (అన్నమయ్య ఉడా) మార్చారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం మున్సిపాలిటీలతో పాటు 9 మండలాలను పీకేఎం ఉడా నుంచి తొలగించారు. రాయచోటి మున్సిపాలిటీ సహా కొత్తగా 11 మండలాలను చేర్చారు. పునర్వ్యస్థీకరణ తర్వాత అన్నమయ్య ఉడాలో మదనపల్లె, రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీలతో పాటు బి.కొత్తకోట నగర పంచాయతీ ఉంటుంది. అలాగే 25 పూర్తి మండలాలు, 378 రెవెన్యూ గ్రామాలుంటాయి.