Share News

పంటలపై ఆగని ఒంటరి ఏనుగు దాడులు

ABN , Publish Date - Jan 10 , 2026 | 02:23 AM

పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతున్నాయి. పాళెం పంచాయతీ సరిహద్దులో వారం రోజులుగా తిష్ఠ వేసిన ఒంటరి ఏనుగు పగలంతా అడవిలో ఉంటూ రాత్రి వేళలో పంటలపై పడటం పరిపాటిగా పెట్టుకుంది

పంటలపై ఆగని ఒంటరి ఏనుగు దాడులు
ఒంటరి ఏనుగు దాడిలో ధ్వంసమైన మామిడి చెట్లు, వ్యవసాయ మోటరు

కల్లూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతున్నాయి. పాళెం పంచాయతీ సరిహద్దులో వారం రోజులుగా తిష్ఠ వేసిన ఒంటరి ఏనుగు పగలంతా అడవిలో ఉంటూ రాత్రి వేళలో పంటలపై పడటం పరిపాటిగా పెట్టుకుంది. పంచాయతీ పరిధిలోని కోటపల్లె వద్ద గురువారం రాత్రి పంటలను ధ్వంసం చేయడంతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని ఎగువచలం నుంచి బయల్దేరిన ఒంటరి ఏనుగు కోటపల్లె వద్దకు చేరుకుంది. రైతులు దామోదర్‌, సుబ్రహ్మణం, హరి, వెంకట్రమణ, రఘు, సుబ్బరత్న మామిడితోటలోకి ప్రవేశించిన ఒంటరి ఏనుగు చెట్ల కొమ్మలను విరిచేసింది. వ్యవసాయ మోటరు, పైపులను ధ్వంసం చేసింది. జొన్నపంటలు, పశుగ్రాసం ధ్వంసం చేశాక వచ్చిన మార్గంలోనే అడవిలోకి తిరుగుముఖం పట్టింది. అడవిలోకి వెళుతూ ఆ మార్గంలోని పలువురు రైతుల మామిడిచెట్ల కొమ్మలను విరుచుకుంటూ వెళ్లింది. శుక్రవారం పగలంతా అడవిలోని సూరప్పచెరువు సమీపంలో ఒంటరి ఏనుగు తిష్ఠ వేసినట్లు స్థానికులు తెలిపారు. ధ్వంసమైన పంటలను మంగళంపేట ఎఫ్‌బీవో మధు శుక్రవారం పరిశీలించారు.

Updated Date - Jan 10 , 2026 | 02:23 AM