స్థానిక పోరు.. సన్నద్ధత జోరు
ABN , Publish Date - Feb 18 , 2026 | 01:23 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటరు జాబితాను మార్చి 9 నాటికి అన్నిచోట్ల ప్రచురించేందుకు సిద్ధంచేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.
చిత్తూరు కలెక్టరేట్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటరు జాబితాను మార్చి 9 నాటికి అన్నిచోట్ల ప్రచురించేందుకు సిద్ధంచేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశాలతో కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగం నుంచి ఓటర్ల జాబితా తరలింపు ప్రారంభమైంది. అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు ఈ జాబితాలను అందజేయనున్నారు. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ సిబ్బంది చిత్తూరు నగరపాలక సంస్థ సిబ్బంది ఓటరు జాబితాలు తీసుకోగా.. పలమనేరు, పుంగనూరు, కుప్పం, నగరి మునిసిపాలిటీలకు బుధవారం అందిస్తారు. ఈ ఏడాది జనవరి ఒకటికి అర్హతతో కూడిన ఫొటో ఓటరు జాబితాలను తరలిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ స్థాయిలో ఓటరు జాబితాలను సులువుగా తయారుచేసేందుకు వీలుగా ఎలక్టోరల్ రోల్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఈఆర్‌ఎంఎ్‌స)ను వినియోగించనున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఓటరు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సహకారంతో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఓటర్ల జాబితాలు ఈఆర్‌ఎంఎస్ సర్వర్ల నుంచి మునిసిపల్, గ్రామ పంచాయతీ అధికారుల లాగిన్‌కి డేటా వెళ్లనుంది. వాటినుంచి పంచాయతీ, పుర, నగరపాలక సంస్థల్లో వార్డులు, డివిజన్లవారీగా ఓటరు జాబితాలు సిద్ధం చేయనున్నారు. సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి రాగనే పంచాయతీ కార్యదర్శులకు కొత్త ఓటర్ల చేరికలు, మృతుల తొలగింపు, మార్పులు- చేర్పులు చేయడానికి అవకాశం కల్పించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మార్చి 9న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించేందుకు కసరత్తు చేస్తున్నారు.
20న ఎన్నికల నిర్వహణపై శిక్షణ
పంచాయతీ ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణపై ఈనెల 20న డీపీవో, డీఎల్డీవో, డిప్యూటీ ఎంపీడీవోలకు శిక్షణనిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని సూచించారు. మంగళవారం ఆమె విజయవాడ నుంచి డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుండి ఓటరు జాబితాలను తీసుకుని, వాటి నుంచి మండలాలు, గ్రామ పంచాయతీలు, వార్డులవారీగా జాబితాలను సిద్ధంచేయాలన్నారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి మార్పులు- చేర్పులు చేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతి ఇంటికి వెళ్ళి గ్రామాల్లో వివరాలు సేకరించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీపీవో సుధాకర్‌రావు, డీఎల్డీవో రవికుమార్, డిప్యూటీ ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.