పల్లెల్లో ‘స్థానిక’ హడావుడి
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:40 AM
తొలుత కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి, తర్వాత పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడతగా గ్రామాల్లో జరిగే ‘స్థానిక సంస్థల’ ఎన్నికలకు హడావుడి మొదలైంది.
పోలింగ్ కేంద్రాల వద్ద ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ
26వ తేది వరకు అభ్యంతరాల స్వీకరణ
31న తుదిజాబితా విడుదల
ఎన్నికల పనుల్లో తలమునకలైన అధికారులు
తొలుత కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి, తర్వాత పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడతగా గ్రామాల్లో జరిగే ‘స్థానిక సంస్థల’ ఎన్నికలకు హడావుడి మొదలైంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు జరుగుతుండగా.. తాజాగా పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లపై దృష్టిసారించారు.
- చిత్తూరు కలెక్టరేట్, ఆంధ్రజ్యోతి
జిల్లాలో 621 గ్రామ పంచాయతీలు, 5906 వార్డులున్నాయి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల జాబితాలను సిద్ధం చేసిన అధికారులు ఆదివారం గ్రామపంచాయతీలవారీగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించారు. గ్రామపంచాయతీ, ఎంపీడీవో, తహసీల్దార్, ఇతర ముఖ్యమైన కార్యాలయాలు, గ్రామ చావడి, స్వర్ణ గ్రామ సచివాలయాల వద్ద వీటిని పబ్లిష్ చేశారు. ముసాయిదా జాబితాలపై 26వ తేదీవరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం వీటిని పరిశీలించాక 31న పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు. స్థానిక ఎంపీడీవోలు, తహసీల్దారులు మండల పరిధిలో పోలీస్ స్టేషన్ల వద్ద ఉన్న పరిస్థితులను మరోసారి పరిశీలించి సంబంధిత వివరాలను అందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మండలాల పరిధిలో ఎంపీడీవో, తహసీల్దార్‌లు పోలీస్ స్టేషన్ల వివరాలు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఫార్మెట్‌లో నమోదు చేశారు.
అత్యధికం.. అత్యల్పం
ఫ ముసాయిదా ఓటరు జాబితా మేర అత్యధికంగా బంగారుపాళ్యం మండలంలో 41, గంగాధరనెల్లూరు, తవణంపల్లి మండలాల్లో 32 చొప్పున గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అత్యల్పంగా పలమనేరులో 10, రొంపిచర్లలో 11 చొప్పున ఉన్నాయి.
ఫ వి.కోట మండలంలో అత్యధికంగా 71,673 మంది ఓటర్లు ఉన్నారు. తర్వాత స్థానాల్లో బంగారుపాళ్యం మండలంలో 59,845, కుప్పం మండలంలో 58,363 మంది ఉన్నారు. అత్యల్పంగా పాలసముద్రంలో 18,030 మంది ఓటర్లు ఉన్నారు.
ఐదింట్లో పురుషులే ఎక్కువ
జిల్లావ్యాప్తంగా పురుషుల కంటే మహిళా ఓటర్లు 11,388 మంది అధికంగా ఉన్నారు. అయితే వెదురుకుప్పం, కార్వేటినగరం, నగరి, పాలసముద్రం, బైరెడ్డిపల్లె గ్రామ పంచాయతీల్లో మాత్రం మహిళల కంటే పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు.
గ్రామ పంచాయతీలు: 621
వార్డులు: 5906
మొత్తం ఓటర్లు: 10,26,821
(పురుషులు 5,07,703, మహిళలు 5,19,091, ఇతరులు 27 మంది)
పోలింగ్ కేంద్రాలు: 5926
ఫ ఓటర్లసంఖ్య ఎక్కువగా ఉండడంతో వి.కోట మండలంలో 208 వార్డులకు 228 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.