డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లికి పావలా వడ్డీతో రుణ సాయం
ABN , Publish Date - May 14 , 2026 | 01:15 AM
ఎన్నికల సమయంలో ఇవ్వని మరో హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహానికి రూ.లక్ష వరకు రుణ సాయం చేసేందుకు నిర్ణయించింది. ‘కల్యాణలక్ష్మి’గా అమలుకానున్న ఈ పథకాన్ని 23వ తేదీన సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
ఏటా వెయ్యి మందికి లబ్ధి కలిగే అవకాశం
ఎన్నికల సమయంలో ఇవ్వని మరో హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహానికి రూ.లక్ష వరకు రుణ సాయం చేసేందుకు నిర్ణయించింది. ‘కల్యాణలక్ష్మి’గా అమలుకానున్న ఈ పథకాన్ని 23వ తేదీన సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
- చిత్తూరు, ఆంధ్రజ్యోతి
జిల్లాలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 30,605 సంఘాలు, వాటిలో 3,02,230 మంది మహిళలున్నారు. పట్టణాల్లోని మెప్మాలో 7,953 సంఘాల్లో 81,700 మంది మహిళా సభ్యులున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 3,83,930 మంది మహిళలున్నారు. వీరిలో వివాహ వయసుకొచ్చిన కుమార్తెలున్నవారి సంఖ్య సగమే ఉండొచ్చు. మొత్తంగా ఏడాదికి వెయ్యి మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, 2014-19లో టీడీపీ ప్రభుత్వం ఆయా కులాల వారికి వివాహ సమయంలో ఉచితంగా ఆర్థిక సాయం అందించింది. ముస్లింలకు దుల్హన్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చంద్రన్న పెళ్లికానుక, బ్రాహ్మణులకు కల్యాణమస్తు, భవన నిర్మాణ కార్మికులకు వివాహ కానుక పేర్లతో రూ.50 వేల వరకు ఆర్థికసాయం అందించారు. దీంతో పేద తల్లిదండ్రులు తమ పిల్లల వివాహాల్ని మరింత చక్కగా జరిపించే అవకాశం కలిటింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాలను రద్దు చేసింది. ప్రస్తుతం అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని తీసుకొస్తోంది.
దరఖాస్తు ఇలా..
అర్హులైన సభ్యులు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వివాహ ఆహ్వాన పత్రిక/ రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారులకు అందించాలి. కొన్ని రోజుల్లోనే సభ్యురాలి బ్యాంకు ఖాతాకు సొమ్ము జమవుతుంది.
అర్హులు ఎవరంటే?
లబ్ధిదారురాలు తప్పనిసరిగా ఏదైనా సంఘంలో కనీసం ఆరు నెలల పాటు సభ్యురాలిగా కొనసాగుతూ ఉండాలి. ఆ సంఘం ‘ఏ’ లేదా ‘బీ’ గ్రేడులో గుర్తింపు పొంది ఉండాలి. గతంలో తీసుకున్న రుణాన్ని క్రమం తప్పకుండా బ్యాంకు చెల్లిస్తుండాలి. వివాహం చేసుకునే అమ్మాయి వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వారికి కనిష్ఠంగా రూ.పది వేలు, గరిష్ఠంగా రూ.లక్ష వరకు రుణం అందిస్తారు. దీనిపై నాలుగు శాతం (పావలా) వడ్డీ వసూలు చేస్తారు.
కల్యాణలక్ష్మిపై అవగాహన కల్పిస్తున్నాం
కల్యాణలక్ష్మి పథకంపై డ్వాక్రా సంఘాల సభ్యులకు మా సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఈ పథకం అమల్లోకి రాగానే అర్హులైన సభ్యుల చేత దరఖాస్తు చేయిస్తాం. ఆర్థికసాయం అందించడానికి కృషిచేస్తాం.
- శ్రీదేవి, డీఆర్‌డీఏ పీడీ, చిత్తూరు