గాల్లో కలుస్తున్న ప్రాణాలు
ABN , Publish Date - Jun 03 , 2026 | 01:55 AM
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కవగా జరుగుతున్నాయి. చిత్తూరు-బెంగుళూరు హైవే విస్తరణ తర్వాత ప్రమాదాల సంఖ్య మరింత పెరిగింది. నిత్యం ప్రమాదాల బారినపడి పలువురు క్షతగాత్రులవుతున్నారు. వీరిని ఉన్నపలాన ప్రైవేటు ఆస్సత్రులకు తరలిస్తుంటే నగదు చెల్లిస్తేనే వైద్యం అందిస్తామని ఖరాకండిగా చెబుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమస్య నుంచి విముక్తి కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. అయినా ఇది పెద్దగా ఉపయోగపడటంలేదు. జిల్లాలోని 9 నెట్‌వర్క్ ఆస్పత్రులకు (ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించే ప్రైవేట్ ఆస్పత్రులు) ఈ పథకం వర్తించేలా అర్హత కల్పించారు. వీటిలో పీఈఎస్ ఆస్పత్రి మినహా మిగిలిన చోట ప్రాణాలు కాపాడేంత సౌకర్యాలులేవు. వైద్య నిపుణులూ లేరని తెలుస్తోంది.
పలు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో లేని ట్రామాకేర్
రోడ్డు ప్రమాద కేసుల్లో సింహభాగం సీఎంసీకి రెఫర్
పీఎం రాహత్ పథకం ఉన్నా లభించని ఊరట
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తక్షణ వైద్యం సమకూర్చితే 60శాతం మంది ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చునని వైద్యులు చెబుతున్నారు. దురదృష్టవశాత్తూ ఆలస్యంగా ఆస్పత్రికి తరలిస్తున్న సందర్భాల్లో ఎక్కువ మందికి తుదిశాస విడుస్తున్నారు. కొన్ని సంఘటనల్లో ఆస్పత్రికి చేర్చినా ట్రామాకేర్‌లో మొక్కుబడి వైద్యం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణాలు నిలబెట్టే కీలక సమయం(గోల్డెన్ అవర్)లో వైద్యసేవలందించే ట్రామాకేర్ విషయంలో బాధితులు పెదవి విరుస్తున్నారు.
-చిత్తూరు రూరల్, ఆంధ్రజ్యోతి
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కవగా జరుగుతున్నాయి. చిత్తూరు-బెంగుళూరు హైవే విస్తరణ తర్వాత ప్రమాదాల సంఖ్య మరింత పెరిగింది. నిత్యం ప్రమాదాల బారినపడి పలువురు క్షతగాత్రులవుతున్నారు. వీరిని ఉన్నపలాన ప్రైవేటు ఆస్సత్రులకు తరలిస్తుంటే నగదు చెల్లిస్తేనే వైద్యం అందిస్తామని ఖరాకండిగా చెబుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమస్య నుంచి విముక్తి కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. అయినా ఇది పెద్దగా ఉపయోగపడటంలేదు. జిల్లాలోని 9 నెట్‌వర్క్ ఆస్పత్రులకు (ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించే ప్రైవేట్ ఆస్పత్రులు) ఈ పథకం వర్తించేలా అర్హత కల్పించారు. వీటిలో పీఈఎస్ ఆస్పత్రి మినహా మిగిలిన చోట ప్రాణాలు కాపాడేంత సౌకర్యాలులేవు. వైద్య నిపుణులూ లేరని తెలుస్తోంది.
సీఎంసీకే కేసుల రెఫర్
చిత్తూరు ఆస్పత్రికి రోడ్డు ప్రమాద బాధితులను తీసుకొస్తే మెరుగైన వైద్యం పేరిట సీఎంసీ, స్విమ్స్‌కు రెఫర్ చేస్తున్నారు. దీంతో ఫుణ్యకాలం కాస్త గడిచి వందలాది మంది మార్గమధ్యలో, లేదా ఆలస్యంగా ఆస్పత్రికి చేరి ప్రాణాలు కోల్పోతున్నారు. మన రాష్ట్ర పరిధిలోని చీలాపల్లి సీఎంసీ, జిల్లాకు పక్కనే ఉన్న రాణిపేట, వేలూరు సీఎంసీల్లో (తమిళనాడు)ల్లో ట్రామాకేర్ సేవలున్నా ఈ పథకం వర్తించడంలేదు. దీంతో నగదు చెల్లించి సేవలు పొందాల్సి వస్తోంది. వాస్తవానికి చిత్తూరు నగరం నుంచి తక్కువ సమయంలో చీలాపల్లికి చేరుకునే అవకాశముంది. హైవేకి ఇది దగ్గర కూడా.
ఆ ఆస్పత్రుల్లో ఏదీ ట్రామా కేర్ ?
జిల్లాలో 9 నెట్‌వర్క్ ఆస్పత్రులుండగా కుప్పం పీఈఎస్, చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి తప్ప మిగిలిన చోట ట్రామా కేర్ యూనిట్ లేదు. చిత్తూరు నుంచి కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి చేరుకోవాలంటే 120 కిలోమీటర్ల దూరం. జిల్లా కేంద్రంలోని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని ట్రామా కేర్ యూనిట్‌లో కీలకమైన న్యూరో సర్జన్ వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. ఇక్కడి ట్రామాకేర్ యూనిట్‌కు పూర్తిస్థాయిలో వసతులు సమకూర్చలేదని తెలుస్తోంది. ఈ కారణంతోనే అత్యధిక శాతం క్షతగాత్రులను సీఎంసీ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. చిత్తూరు సమీపంలోని చీలాపల్లి సీఎంసీకి పీఎం రాహత్ పథకాన్ని వర్తింపజేసేలా జిల్లా అధికారులు చొరవ తీసుకుంటే రోడ్డు ప్రమాద బాధితులకు మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పథకం కింద రూ.1.50లక్షల వరకూ నగదు రహిత వైద్య సేవలు సమకూరతాయి. వారం రోజుల వరకూ పథకం కింద వైద్య ఖర్చులు పొందవచ్చు. పథకం వర్తించని ఈ ఆస్పత్రులకు వెళ్లి నగదు చెల్లించి వైద్య సేవలు పొందాలనే భావనతో చాలామంది వెనకడుగు వేస్తున్నారు.