అక్షరాలా 2444.33 కోట్లు ఇదీ రాష్ట్ర బడ్జెట్‌లో మన జిల్లా వాటా
ABN , Publish Date - Apr 25 , 2026 | 01:44 AM
బడ్జెట్ అంటే అన్నీ లెక్కలే. కేటాయింపులు ఎంత? వచ్చిందెంత? ఖర్చు పెట్టింది ఎంత? ఈ లెక్కలు చూస్తే ఇది సామాన్యులకు అర్థంకాని పరిస్థితి. దీనికి కూటమి ప్రభుత్వం చరమగీతం పాడుతోంది. ప్రతి పైసాకు లెక్క. ప్రజలందరికీ తెలిసేలా బడ్టెట్ ఔట్‌రీచ్-2027 శ్రీకారం చుట్టింది
ప్రతి పైసా లెక్క ప్రజలకు తెలిసేలా ప్రభుత్వం చర్యలు
నియోజకవర్గాల వారీగా కేటాయింపుల విభజన
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): బడ్జెట్ అంటే అన్నీ లెక్కలే. కేటాయింపులు ఎంత? వచ్చిందెంత? ఖర్చు పెట్టింది ఎంత? ఈ లెక్కలు చూస్తే ఇది సామాన్యులకు అర్థంకాని పరిస్థితి. దీనికి కూటమి ప్రభుత్వం చరమగీతం పాడుతోంది. ప్రతి పైసాకు లెక్క. ప్రజలందరికీ తెలిసేలా బడ్టెట్ ఔట్‌రీచ్-2027 శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు రూ. 2444.33 కోట్లు దక్కాయి. జిల్లాకు సంబంధించి వివిధ రంగాల్లో కేటాయింపులు, ఆ మొత్తాల నుంచి నియోజకవర్గాలు, మండలాల వారీగా ఎంత ఇస్తున్నారో అధికారులు లెక్క తేల్చారు. ఈ వివరాలన్నీ ప్రజలకు అర్థమయ్యేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
క్షేత్ర స్థాయి నుంచి సమగ్ర నివేదికల ద్వారా డబ్బు ఖర్చు చేయనున్నారు.
ప్రజా ప్రతినిధుల సూచనలకూ పెద్దపీట వేయనున్నారు.
పథకాల అమల్లో ఎక్కడైనా లోపాలుంటే సరిదిద్దుకోవడంతో పాటు ప్రజలందరికీ వాటి ఫలాలు అందేలాఆ చూడనున్నారు.
వ్యవసాయ, ఉద్యాన, వాణిజ్య పంటలతో పాటు విద్య, వైద్యం సహా 47 శాఖల పరిధిలో ఏయే శాఖలకు ఎంతెంత కేటాయించారో లెక్క తేలింది.
ఏయే పథకాల ద్వారా ప్రజలకు ఏమేమీ చేయవచ్చో క్షేత్రస్థాయి నుంచి సమగ్ర నివేదికలు తయారు చేశారు.
ఆయా శాఖల పరిధిలో మండలాల వారీగా నిధులు ఎన్ని వస్తున్నాయో ప్రజలకు తెలియజేయడం ద్వారా నిధుల లభ్యత, ఖర్చుపై స్పష్టత వస్తుంది.
కేటాయించిన సొమ్మును మండలాల వారీగా లెక్కలు తీసి పనులను చేపడతారు.
పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాల లెక్క కూడా తేలింది.
అభివృద్ధికి ఊతం
శాఖల వారీగా పక్కాగా లెక్క తేలింది. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికతో పనులు చేపట్టనున్నారు. కేంద్రం నుంచి ఇచ్చే నిధులకు రాష్ట్ర వాటా సమకూర్చి చేపడుతున్న పథకాలను సైతం జాబితాలో చేర్చారు.
ప్రజా ప్రతినిధులకు అందించిన వివరాలు
కూటమి ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన నిధుల పద్దులను కలెక్టరేట్‌కు పంపింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఇటీవల కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కేటాయింపులను ఎలా ఖర్చు చేయాలో కార్యాచరణ అమలుకు సూచించింది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు రూ.2444.33 కోట్లు దక్కాయి. ఆరు సంక్షేమ పథకాలకు సంబంధించి రూ. 1956.26 కోట్లు, మిగిలిన 47 శాఖలకు రూ. 488.07 కోట్ల చొప్పున కేటాయించారు. ఈ నెలలో ఖర్చులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక పట్టాలెక్కనుంది.
పథకాల వారీగా కేటాయింపులు(రూ. కోట్లలో)
ఎన్టీఆర్ భరోసా : 1221.14
తల్లికి వందనం : 301.88
అన్నదాత సుఖీభవ : 289.95
దీపం-2 : 93.56
స్తీశక్తి : 40.46
ఆటో డ్రైవర్ల సేవలో : 9.16
మరో 47 శాఖలకు : 488.07
----------------------------------------------
మొత్తం : 2444.33
-------------------------------------------------
ఏ విభాగానికి ఎంత? (రూ.కోట్లలో)
గ్రామీణాభివృద్ధి : 454.26
రవాణా : 196.62
స్త్రీ, శిశు సంక్షేమం : 148,79
పంచాయతీరాజ్ (ఇంజనీరింగ్ విభాగం): 159.32
పాఠశాల విద్య : 195.95
కుటుంబ సంక్షేమం : 141.17
గృహ నిర్మాణం : 184.26
పంచాయతీరాజ్ : 230.22
ఇతర విభాగాలకు : 733.74
-----------------------------------------
మొత్తం : 2444.33
-----------------------------------
ఏ నియోజకవర్గానికి ఎంత? (రూ.కోట్లలో)
చిత్తూరు : 435.65
గంగాధరనెల్లూరు : 353.04
కుప్పం : 527.49
నగరి : 181.34
పలమనేరు : 483.27
పుంగనూరు : 130.20
పూతలపట్టు : 333.32
----------------------------------
మొత్తం : 2444.33
----------------------------------