Share News

నేతన్నలకు ‘వెలుగు’

ABN , Publish Date - Apr 02 , 2026 | 02:03 AM

చేనేత, మరమగ్గాల యజమానుల చిరకాల కోరిక నెరవేరింది. తమిళనాడు తరహాలో ఇక్కడా కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్తును బుధవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. తమిళనాడులో 2008లో మర మగ్గ, చేనేతలకు ఉచిత కరెంటును అక్కడి ప్రభుత్వం అమలు చేసింది. దీనివల్ల వారి ఉత్పత్తి ఖర్చు తగ్గింది.

నేతన్నలకు ‘వెలుగు’
నగరిలో బుధవారం మరమగ్గాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే భానుప్రకాష్‌

చేనేత, మర మగ్గాలకు ఉచిత విద్యుత్తు అమలు

నగరి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): చేనేత, మరమగ్గాల యజమానుల చిరకాల కోరిక నెరవేరింది. తమిళనాడు తరహాలో ఇక్కడా కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్తును బుధవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. తమిళనాడులో 2008లో మర మగ్గ, చేనేతలకు ఉచిత కరెంటును అక్కడి ప్రభుత్వం అమలు చేసింది. దీనివల్ల వారి ఉత్పత్తి ఖర్చు తగ్గింది. వీరితో పోటీ పడాలన్నా.. తామూ కాస్త ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా ఉచిత విద్యుత్తు అమలు చేయాలంటూ ఇక్కడి నేతన్నలూ కోరారు. దాదాపు 2012 నుంచి నగరిలోని చేనేత, మర మగ్గ యజమానులు ఉచిత విద్యుత్‌ కోసం పోరాటాలు చేస్తూ వచ్చారు. నాయకులు హామీలివ్వడమే కానీ అమలు చేసింది లేదు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో విద్యుత్‌ బిల్లులు భారీగా పెరిగాయి. దీనిపై వీరంతా పలుమార్లు ఆందోళనలు చేపట్టారు.తాము అధికారంలోకి వస్తే మరమగ్గాలకు 500, చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తామని 2024 ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే భానుప్రకాష్‌ పలుమార్లు ప్రభుత్వంతో చర్చించారు. బుధవారం నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్తు అమలు చేయడం ద్వారా సీఎం చంద్రబాబు వారికిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నేతన్నలకు చేయూతనిచ్చారు. దీనివల్ల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14,500 మరమగ్గ.. 450 చేనేత కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి.

మాట నిలబెట్టుకున్నాం

‘నేతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. చేనేతలకు 200, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తును అమల్లోకి తెచ్చాం’ అని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ తెలిపారు. మరమగ్గ, చేనేతలకు బుధవారం నుంచి ఉచిత విద్యుత్తు అమలైన నేపథ్యంలో ఆయన నగరి పట్టణం కొత్తపేటలోని మరమగ్గాలను పరిశీలించారు.అనంతరం స్థానిక టీడీపీ నాయకులు, మరమగ్గాల యజమానులతో కలిసి ఉచిత విద్యుత్‌ కరపత్రాలను పంపిణీ చేశారు.

- ఎమ్మెల్యే భానుప్రకాష్‌

Updated Date - Apr 02 , 2026 | 02:03 AM