Share News

ప్రాణం తీసిన ఈత సరదా

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:25 AM

చెరువులో లోతు తక్కువ ప్రాంతంలో సరదాగా ఈత కొట్టుకుంటున్నారు. కాస్త ముందుకెళ్లగానే పెద్దగుంతలో పడి ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ విషాద ఘటన బుధవారం బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట పంచాయతీ బీఎల్‌ కండ్రిగ పాళ్యంతోపు చెరువులో చోటు చేసుకుంది.

ప్రాణం తీసిన ఈత సరదా
మృతి చెందిన సత్య, రోహిత్‌, సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ, సిబ్బంది

చెరువులో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి

బంగారుపాళ్యం, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): చెరువులో లోతు తక్కువ ప్రాంతంలో సరదాగా ఈత కొట్టుకుంటున్నారు. కాస్త ముందుకెళ్లగానే పెద్దగుంతలో పడి ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ విషాద ఘటన బుధవారం బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట పంచాయతీ బీఎల్‌ కండ్రిగ పాళ్యంతోపు చెరువులో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాసులు తెలిపిన ప్రకారం.. పాళ్యంతోపు ఎస్టీ కాలనీకి చెందిన ఎన్‌.లోకే్‌ష, దేవి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇతడి బావమరిది భార్య స్రవంతి బుధవారం దుస్తులు ఉతకడానికి పాళ్యంతోపు సమీపంలోని చెరువుకు వెళ్లారు. ఆమెతో పాటు లోకేష్‌ పెద్ద, రెండో కుమార్తెలు లౌక్య, సత్యతో పాటు అతడి తమ్ముడి కుమారుడు రోహిత్‌ కూడా వెళ్లారు. స్రవంతి, లౌక్య దుస్తులు ఉతుకుతుండగా సత్య, రోహిత్‌లో చెరువులో సరదాగా ఈత కొట్టసాగారు. ఈ క్రమంలో చెరువులోని పెద్ద గుంత గురించి తెలియక వెళ్లడంతో.. ఈతరాక మునిగిపోయారు. దీనిని గమనించి స్రవంతి, లౌక్య కేకలు వేయడంతో సమీపంలో ఉన్న కార్తీక్‌ యువకుడు చెరువులో దిగి.. నీట మునిగిపోయిన సత్య(15), రోహిత్‌ (9)ను బయటకు తీశారు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకుని సత్య, రోహిత్‌ను బంగారుపాళ్యం ప్రభుత్వాసుపత్రికి తరలించగా డాక్టర్లు పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. చిత్తూరులోని గురుకుల పాఠశాలలో సత్య తొమ్మిదవ తరగతి.. బీఎల్‌ కండ్రిగలోని ప్రభుత్వ పాఠశాలలో రోహిత్‌ 3వ తరగతి చదువుతున్నారు. వరసకు అక్కా తమ్ముళ్ల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లోకేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.

Updated Date - Jun 04 , 2026 | 01:25 AM