కుప్పం రైతు బతుకు బంగారం!
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:17 AM
కుప్పంలో ఉత్పత్తి అయ్యే వివిధ ఉద్యాన పంటలు పొరుగు రాష్ట్రాల్లో మార్కెటింగ్ చేయడానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు
కుప్పం/ శాంతిపురంగుడుపల్లె, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కుప్పంలో ఉత్పత్తి అయ్యే వివిధ ఉద్యాన పంటలు పొరుగు రాష్ట్రాల్లో మార్కెటింగ్ చేయడానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో నాణ్యమైన అధిక దిగుబడుల సాధనకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రూ.కోట్ల పెట్టుబడితో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను స్థాపిస్తున్న వేళ, కుప్పం రైతు బతుకు బంగారమవుతుందన్నారు. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ వద్ద ఆదివారం ఆయన నియోజకవర్గ రైతులతో సమావేశమయ్యారు. కుప్పంనుంచి పండ్లు, కూరగాయల క్లస్టర్ల ద్వారా బెంగళూరు, చెన్నై, హైదరాబాదుకు మార్కెటింగ్ చేసేలా ఐటీసీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. అత్యాధునిక వ్యవసాయ విధానాలను రైతులు అనుసరించేలా కడా ద్వారా విశాలాక్షి ఇన్నోవేషన్ సస్టైనబుల్ వ్యాల్యూ సంస్థతో కూడా ఒప్పందం జరిగిందన్నారు. ఫౌలీ్ట్ర, డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్‌లాంటి రంగాలలో పెట్టుబడి పెట్టేందుకు వివిధ కంపెనీలు ముందుకొస్తున్నాయన్నారు. కుప్పంలో రూ.10 వేల కోట్ల మేర ప్రాజెక్టులు వచ్చాయన్నారు. మదర్ డెయిరీ, ఐటీసీ, ఏబీస్ వంటి ప్రతిష్ఠాత్మక పరిశ్రమలు ఇందులో ఉన్నాయన్నారు. ఉద్యాన ఉత్పత్తులు సాగు చేయడంలో రాయలసీమ దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నదన్నారు. అంతర్జాతీయ డిమాండున్న పండ్లు, ఇతర ఉద్యాన ఉత్పత్తులను సాగుచేసేలా ప్రణాళికలు చేస్తామని సీఎం తెలిపారు. ప్రకృతి సేద్యంలో మన రైతులు గతంలో చేసిన కృషికి గుర్తింపుగా స్విట్జర్లాండ్‌లో ప్లానెట్ ఫుడ్ బహుమతి ఇచ్చారని గుర్తుచేశారు. దీనివల్ల ఆరోగ్యకరమైన జీవిన విధానం సాధ్యమన్నారు. కాగా, మిల్లెట్ చెఫ్ పేరిట మైదా, పంచదార లేకుండా తయారు చేసిన బేకరీ ఫుడ్, ఇతర స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు రైతులు నాగలిని బహూకరించారు.