Share News

పలమనేరులో జీవిత ఖైదీ పరారీ

ABN , Publish Date - Aug 12 , 2026 | 01:57 AM

పలమనేరులో జైళ్లశాఖ నిర్వహిస్తున్న ఐవోసీఎల్‌ పెట్రోలు బంకులో పనిచేస్తున్న జీవిత ఖైదీ ఎన్‌.సూర్య అలియాస్‌ సూరి(34) పరారయ్యాడు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్‌ ఎ.యూనస్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

పలమనేరులో జీవిత ఖైదీ పరారీ

జైళ్లశాఖ ఆధ్వర్యంలోని పెట్రోల్‌ బంకులో పనిచేస్తూ వెళ్లిపోయిన పిచ్చాటూరువాసి

పలమనేరు, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): పలమనేరులో జైళ్లశాఖ నిర్వహిస్తున్న ఐవోసీఎల్‌ పెట్రోలు బంకులో పనిచేస్తున్న జీవిత ఖైదీ ఎన్‌.సూర్య అలియాస్‌ సూరి(34) పరారయ్యాడు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్‌ ఎ.యూనస్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.నాగలాపురం పోలీసుస్టేషన్‌ పరిధిలోని నందనం క్రాస్‌ రోడ్డు వద్ద 2017 మే ఒకటో తేది అర్ధరాత్రి ఎన్‌.సూర్య అలియస్‌ సూరి.. పిచ్చాటూరు మండలం అడవికొడియంబేడు ఆది ఆంధ్రవాడకు చెందిన గజేంద్ర(43)తో కలిసి మద్యం తాగుతున్నాడు. ఆ సమయంలో సూరి గ్లాస్‌లోని మద్యం కిందపడడంతో గజేంద్రతో గొడవ పడ్డాడు. స్థానికులు నచ్చచెప్పడంతో సూరి వెళ్లిపోయాడు. తనను సూరి ఏమైనా చేస్తాడని భావించిన గజేంద్ర.. ఇంటికి సమాచారం ఇచ్చి అక్కడే ఉన్న చింత చెట్టుకింద నిద్రపోయాడు. తన మద్యంగ్లాస్‌ కింద పోశాడన్న కోపంతో పగపెంచుకొన్న సూరి కొద్దిసేపటికే కత్తి తీసుకొచ్చి నిద్రిస్తున్న గజేంద్రను హతమార్చి పారిపోయాడు. దీనిపై గజేంద్ర కుమారుడు గిరిప్రసాద్‌ మే 2వ తేది ఉదయం నాగలాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య కేసు నమోదు చేసిన అప్పటి సీఐ నరసింహులు.. అదేనెల 8వ తేదీన నిందితుడిని ఊత్తుకోట రహదారి వద్ద అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. 2017 ఆగస్టు 24న గజేంద్ర హత్యకేసులో సీఐ ఛార్జిషీటు దాఖలు చేశారు. దీనిపై పూర్వాపరాలు విచారించిన శ్రీకాళహస్తి సెషన్స్‌ జడ్జి 2023 ఆగస్టు 9న హరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో ముద్దాయిని చిత్తూరు జైలుకు తరలించారు. ఇక, పలమనేరులో జైళ్లశాఖ అధికారులు ప్రారంభించిన ఐవోసీఎల్‌ పెట్రోలు బంకులో పనిచేసేందుకు హరిని పంపించారు. పెట్రోలు బంకులో పనిచేస్తున్న హరి ఈనెల 9వతేది సాయంత్రం పరారయ్యాడు. దీనిని గుర్తించిన తోటి ఖైదీలు అధికారులకు సమాచారమిచ్చారు. జైలు సూపరింటెండెంట్‌ యూనస్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - Aug 12 , 2026 | 01:57 AM