భూమన ఆక్రమిత భూమికి విముక్తి
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:38 AM
తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కుటుంబీకుల ఆక్రమణలో ఉన్న స్వర్ణముఖి పోరంబోకు భూమికి విముక్తి లభించింది. నదిని ఆనుకుని ఆక్రమించిన 9.33 ఎకరాల చుట్టూ రెవెన్యూ అధికారులు కందకాలు తవ్వారు
తిరుపతి(టీటీడీ), జూలై 23 (ఆంధ్రజ్యోతి) : తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కుటుంబీకుల ఆక్రమణలో ఉన్న స్వర్ణముఖి పోరంబోకు భూమికి విముక్తి లభించింది. నదిని ఆనుకుని ఆక్రమించిన 9.33 ఎకరాల చుట్టూ రెవెన్యూ అధికారులు కందకాలు తవ్వారు.వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకొని తిరుచానూరుతో పాటు మంగళం పరిధిలో భూమన ఆక్రమించిన సుమారు 16 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.తిరుచానూరు పరిధిలో స్వర్ణముఖి నది పక్కన 9.33ఎకరాల పోరంబోకు భూమిని ఆక్రమించిన విషయాన్ని రెవెన్యూ అధికారులు బుధవారం సర్వే ద్వారా గుర్తించారు.హద్దులకు మార్కింగ్ చేసి ట్రెంచ్ కొట్టి దాన్ని దాటుకుని రాకుండా హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.మార్కింగ్ చేసిన ప్రాంతంలో పొక్లయిన్లతో కందకం తవ్వారు. గురువారం ఉదయం మళ్లీ ఆక్రమణల తొలగింపు ప్రారంభించి మామిడితోట చుట్టూ కట్టిన ప్రహరీని కూల్చివేసే ప్రయత్నం చేశారు. అయితే కొంత మేరకు పై భాగాన్ని కూల్చివేసినా , కింది భాగం వరకు మట్టిని తొలగించినా పునాదులు ఇంకా 20 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు.డ్రిల్లింగ్ మెషిన్ తెప్పించి తొలగించాలని చూసినా ఇబ్బందులు ఎదురయ్యాయి. డ్రిల్లింగ్ చేసినా నిర్మాణాల తొలగింపు కష్టంగా మారడంతో ఆ 9.33 ఎకరాల చుట్టూ కందకాలు తవ్వారు.కలెక్టర్ నుంచి ఆమోదం తీసుకుని చుట్టూ ఫెన్సింగ్ వేయనున్నారు.బుఽధవారం సాయంత్రం ఆక్రమణలు కూల్చివేసే సమయంలో కరుణాకర రెడ్డి కుమారుడు అభినయ్ అనుచరులతో అక్కడికి వచ్చి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. అయితే తాము గతంలోనే నోటీసులు ఇచ్చామని మరోమారు ఇవ్వాల్సిన అవసరం లేదని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పడంతో వెళ్లిపోయారు.ఈ నేపథ్యంలో గురువారం ప్రహరీ కూల్చివేసే సమయంలో వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేసే అవకాశం ఉందని భావించిన పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రధాన రహదారి నుంచి ఆక్రమణలు తొలగించే ప్రాంతానికి కేవలం పోలీసు, రెవెన్యూ సిబ్బందిని మాత్రమే అనుమతించారు.