కాపాడవమ్మో.. గంగమ్మ తల్లో!
ABN , Publish Date - May 20 , 2026 | 02:25 AM
కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవం అంతిమ ఘట్టానికి చేరిన వేళ మంగళవారం అమ్మవారి శిరస్సు ఊరేగింపు వైభవోపేతంగా సాగింది. ఒళ్లు గగుర్పొడిచే అమ్మ రూపం, భక్తులపై కరుణనే కురిసింది. ఉదయం ప్రారంభమైన గంగమ్మ శిరస్సు ఊరేగింపు పాతపేట, ఆర్‌ఆర్ కూడలి, ప్యాలెస్ రోడ్డు, నేతాజీ రోడ్డు, కొత్తపేట మీదుగా మంగళవారం అర్ధరాత్రి దాకా సాగుతూ.. ఆలయంవైపు కదిలింది. ఈ సందర్భంగా అమ్మవారు నెమ్మదిగా కదులుతూ.. పతి ఇంటివద్దా ఆగుతూ.. మొక్కుగా జనం ఇచ్చే జీవాల బలులు.. హారతులు స్వీకరిస్తూ.. ముందుకు కదిలారు. ఆంధ్రాతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలనుంచీ వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారి దివ్య స్వరూపాన్ని దర్శించి తరించారు.
కుప్పంలో వైభవంగా అమ్మ శిరస్సు ఊరేగింపు
గుండెలదిరిలేగా డ్రమ్ముల మోతలు. జతుల నడకలో మృదంగాల వరుసలు. శ్రావ్యంగా సాగే సన్నాయి పాటలు. వాయిద్యాల ఘోషకు అనుగుణంగా శివమెత్తి నర్తించే పాదాలు. అడుగడుగునా జీవాల తలలు తెగి జనాల మొక్కులు. రక్తధారలతో ఎర్రబారిన నేలలు. గంగమ్మ శిరస్సు ఊరేగింపు విభవం వర్ణించడానికి వీలుకానిది. చూడ రెండు కన్నులైనా చాలనది.
- కుప్పం, ఆంధ్రజ్యోతి
కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవం అంతిమ ఘట్టానికి చేరిన వేళ మంగళవారం అమ్మవారి శిరస్సు ఊరేగింపు వైభవోపేతంగా సాగింది. ఒళ్లు గగుర్పొడిచే అమ్మ రూపం, భక్తులపై కరుణనే కురిసింది. ఉదయం ప్రారంభమైన గంగమ్మ శిరస్సు ఊరేగింపు పాతపేట, ఆర్‌ఆర్ కూడలి, ప్యాలెస్ రోడ్డు, నేతాజీ రోడ్డు, కొత్తపేట మీదుగా మంగళవారం అర్ధరాత్రి దాకా సాగుతూ.. ఆలయంవైపు కదిలింది. ఈ సందర్భంగా అమ్మవారు నెమ్మదిగా కదులుతూ.. పతి ఇంటివద్దా ఆగుతూ.. మొక్కుగా జనం ఇచ్చే జీవాల బలులు.. హారతులు స్వీకరిస్తూ.. ముందుకు కదిలారు. ఆంధ్రాతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలనుంచీ వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారి దివ్య స్వరూపాన్ని దర్శించి తరించారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణం భక్తజనంతో కిటకిటలాడింది. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా శివార్లనుంచి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పోలీసులు మళ్లించారు. ఆయా ప్రాంతాలలో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు.
నేడు గంగమ్మ విశ్వరూప దర్శనం
కుప్పం గంగ జాతరలో ప్రధాన ఘట్టమైన గంగమ్మ విశ్వరూప దర్శనం బుఽధవారం నిర్వహిస్తారు. మంగళవారమంతా కుప్పంలో ఊరేగిన అమ్మవారి శిరస్సును ఆఖరున ఆలయంలోకి తీసుకొచ్చి పూజలు చేస్తారు. అప్పటికే ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకుంటున్న అమ్మవారి మొండేనికి శిరస్సును అమరుస్తారు. మళ్లీ ప్రత్యేక పూజలు నిర్వహించి, తెర తొలగిస్తారు. ఈ శాస్త్రోక్త ప్రక్రియ పూర్తయ్యే సరికి బుధవారం తెల్లవారుజాము అవుతుంది. అనంతరం గంగమ్మ సంపూర్ణ దివ్యరూపంతో భక్తులకు సాక్షాత్కరిస్తుంది.
నేడు సీఎంచే పట్టువస్త్రాల సమర్పణ
కుప్పం జాతర సందర్భంగా గంగమ్మకు బుధవారం ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దీనికోసం సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో శాంతిపురం మండలం తుమ్మిశి వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ్నుంచి కడపల్లె పంచాయతీ శివపురం వద్ద గల ఇంటికి వెళతారు. అక్కడ్నుంచి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు 10.45 గంటలకు కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయానికి చేరుకుని, ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం ఇంటికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తుమ్మిశి హెలిప్యాడ్‌కు చేరుకుని, హెలికాప్టర్ ద్వారా బెంగళూరు ఎయిర్ పోర్టుకు బయలుదేరి వెళ్తారు. కాగా, నారా భువనేశ్వరి మంగళవారం రాత్రి శివపురంలోని ఇంటికి చేరుకున్నారు.