Share News

ఏకగ్రీవం చేసుకుందాం!

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:18 AM

పెరిగిన ప్రోత్సాహకాలతో పంచాయతీల అభివృద్ధి వైసీపీని ఒప్పించే పనిలో కూటమి నేతలు

ఏకగ్రీవం చేసుకుందాం!

చిత్తూరు అర్బన్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల వేళ ఏకగ్రీవాల దిశగా మంతనాలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను పెంచింది. ఈ మొత్తంతో గ్రామాభివృద్ధి చేసుకునేందుకు సహకరించాలని వైసీపీని ఒప్పించే పనిలో కూటమి నేతలు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ అక్రమంగా చేసుకున్న ఏకగ్రీవాలను గుర్తుచేస్తున్నారు. ఈ సారి శాంతియుతంగా పోటీలేకుండా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలోని 27 మండలాల పరిఽధిలో 617 పంచాయతీలు, 5866 వార్డులకు ప్రస్తుతం మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో తొమ్మిది, రెండో విడతలో పది, మూడో విడతలో ఎనిమిది మండలాల పరిఽధిలో ఈ పంచాయతీలున్నాయి. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 1411 పంచాయతీలు ఉండగా వివిధ కారణాలతో 43కు ఎన్నికలు జరగలేదు. బి.కొత్తకోట నగర పంచాయతీగా ప్రకటించడంతో మిగిలిన 1367పంచాయతీలకు వైసీపీ హయాంలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో 358 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అప్పట్లో వైసీపీ నేతలు గ్రామాల్లో దౌర్జన్యాలు చేసి.. టీడీపీ నేతలను భయబ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవాలు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏకగ్రీవాల కోసం వైసీపీ నేతలను చర్చించే పనుల్లో ఉన్నారు.

భారీగా పెరిగిన ప్రోత్సాహకాలు

అందరి అంగీకారంతో సర్పంచ్‌ పదవి ఏకగ్రీవమైతే పల్లెలు అభివృద్ధి చెందుతాయనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఈసారి ఆ మొత్తాన్ని భారీగా పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 10వేలకు పైబడి జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.50లక్షల నజరానా ఇస్తారు. 10వేలలోపు జనాభా ఉంటే రూ.25లక్షలు, 5వేల లోపు ఉంటే రూ.15లక్షల నజరానా ప్రకటించింది. అయితే, సర్పంచితో పాటు వార్డు సభ్యులూ ఏకగ్రీవమై, ఎన్నికలే జరగకూడదనే షరతు విధించింది.

కాగా, గతప్రభుత్వంలో.. రెండువేల లోపు జనాభా ఉండి ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ.5లక్షలు, 2001 నుంచి 5వేల వరకుంటే రూ.పది లక్షలు, 5001 నుంచి 10వేల వరకు రూ.15లక్షలు. పదివేలకుపైన ఉంటే రూ.20లక్షల నజరానా ఇచ్చారు.

నేతల మధ్య పరస్పర అవగాహన

కూటమి ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సహాకాలను భారీగా పెంచడం ద్వారా గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించాలని భావిస్తోంది. పంచాయతీ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య పోటీలు, వ్యక్తిగత కక్షలు, వర్గ విబేధాలు తలెత్తుతాయి. కొన్ని చోట్ల ఇవి ఘర్షణలకు దారి తీసి పోలీసు కేసుల వరకు వెళ్లి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇప్పటికి కొంత మంది పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఘర్షణల ప్రభావం పంచాయతీ పాలనపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటన్నింటిని కూటమి పార్టీల నేతలు ప్రతిపక్ష పార్టీ నేతలకు చెబుతున్నారు. తమ పార్టీ అధికారంలో ఉండటంతో ఏకగ్రీవాలకు సహకరిస్తే ప్రోత్సాహక నిధులతో పాటు సాఽధారణ నిధులతో పంచాయతీలను మరింత అభివృద్ధి చెసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సారి తాము బలపరిచే అభ్యర్థికి వదిలేయండని.. వైసీపీ అధికారంలోకి వస్తే తాము సహకరిస్తామని కొన్ని చోట్ల ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. అధికారం లేకపోవడంతో ప్రతిపక్ష వైసీపీ నేతలు కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మొదలైన ‘పంచాయితీ’లు

ఇక, ఆయా గ్రామాల్లో సర్పంచి, వార్డు అభ్యర్థులను రిజర్వేషన్ల వారీగా ఎవరిని నిలబెట్టాలనే దానిపై ‘పంచాయితీ’లు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల తనను ఏకగ్రీవం చేస్తే పంచాయతీకి పెద్దలు నిర్ణయించిన మొత్తాన్ని ఇచ్చేస్తామని అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. అలా ఇచ్చే నగదుతో పాటు ప్రోత్సాహక నజరానాతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని సూచిస్తున్నారు. మొత్తమ్మీద

Updated Date - Nov 16 , 2026 | 12:18 AM