డ్రగ్స్ నుంచి యువతను కాపాడుకుందాం
ABN , Publish Date - Mar 26 , 2026 | 02:10 AM
దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతను డ్రగ్స్ నుంచి కాపాడుకుందామని కలెక్టర్ సుమిత్‌కుమార్ పిలుపునిచ్చారు. ‘
అధికారులకు కలెక్టర్ పిలుపు
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతను డ్రగ్స్ నుంచి కాపాడుకుందామని కలెక్టర్ సుమిత్‌కుమార్ పిలుపునిచ్చారు. ‘మాదక ద్రవ్యాలు, గంజాయి నియంత్రణ చర్యలు - అవగాహన’ కార్యక్రమాలపై బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఇతర కళాశాలల్లో క్లస్టర్ స్థాయిలో ఆర్డీవోలు, డీఎస్పీలు, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో మాదక ద్రవ్య రహితంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. డ్రగ్స్‌కు బానిస కాకుండా యువతను అప్రమత్తంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు అక్రమంగా టొబేకో ఉత్పత్తులు సరఫరా చేస్తున్నవారిపై ఫుడ్ సేఫ్టీ, పోలీసు, ఈగల్, ఇతర శాఖలు సంయుక్తంగా కలసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి నగరి, కుప్పం డివిజన్లలోకి డ్రగ్స్ ప్రవేశించకుండా సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ఠ నిఘా ఉంచాలన్నారు. డ్రగ్స్ సంబంధిత సమాచారం అందితే పోలీసు లేదా ఈగల్ టోల్ ఫ్రీ నెంబరు 1972కు తెలియజేయాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. జిల్లాలో 25 ఉన్నత పాఠశాలల్లో రూ.2 లక్షలు విలువచేసే సీసీ కెమెరాలు వారం రోజుల వ్యవధిలో ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో జిల్లాను డ్రగ్ రహిత జిల్లాగా మార్చుదామని పిలుపునిచ్చారు. గ్రామాల్లో గంజాయిసాగుపై కిందిస్థాయి అధికారులకు, ఫారెస్టు బీట్ అధికారులకు, ఈగల్ అధికారులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజశేఖర్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసు, డ్రగ్స్ నియంత్రణ అధికారిణి కీర్తన, వ్యవసాయశాఖ జేడీ మురళి, ఆర్‌ఐవో రఘుపతి, ఈగల్ ప్రతినిధి గిరిబాబుతో పాటు ఇన్‌స్పెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.