కలసికట్టుగా పనిచేద్దాం!
ABN , Publish Date - Sep 27 , 2026 | 01:30 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసికట్టుగా పనిచేద్దామని టీడీపీ, బీజేపీ,జనసేన పార్టీల నేతలు పునరుద్ధాటించారు. శనివారం తిరుపతిలోని పాయ్ వైస్రాయ్ హోటల్లో మూడు పార్టీల తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కమిటీల సమావేశం జరిగింది.
తిరుపతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసికట్టుగా పనిచేద్దామని టీడీపీ, బీజేపీ,జనసేన పార్టీల నేతలు పునరుద్ధాటించారు. శనివారం తిరుపతిలోని పాయ్ వైస్రాయ్ హోటల్లో మూడు పార్టీల తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కమిటీల సమావేశం జరిగింది. టీడీపీ పరిశీలకుడు, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని వార్డులు, డివిజన్లు అనేది అధిష్ఠానాలు నిర్ణయిస్తాయని, ఆ విషయం పక్కన పెట్టి పార్టీల మధ్య సమన్వయం సాధించే దిశగా చర్యలు తీసుకుందామని పిలుపిచ్చారు. వైసీపీ ఫేక్ ప్రచారాలను కూడా మూడు పార్టీల నేతలూ కలసికట్టుగా తిప్పికొట్టాలని సూచించారు.రిజర్వేషన్ల విషయమై మాట్లాడుతూ అది ప్రభుత్వం చూసుకుంటుందని, అయితే మొత్తంగా 50 శాతం మహిళలకు ప్రాతినిధ్యం వుంటుందన్నది కూటమి పార్టీల అధిష్ఠానాల నిర్ణయమన్నారు. కాబట్టి మహిళలు ఎక్కువగా పోటీ చేసేలా ప్లాన్ చేసుకోవాలని కూటమి పార్టీల నేతలకు సూచించారు.సర్ ప్రక్రియ ముగిశాకే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలంటూ వైసీపీ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై బుధవారం తీర్పు వచ్చే అవకాశముందని, దాన్నిబట్టి కార్యాచరణ నిర్ణయించుకుందామన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీపీ, జనసేన పార్టీల నుంచీ ఆశావహులు అధికంగా వున్నారని, అయితే అధిష్ఠానాలు నిర్ణయించిన ప్రకారమే నడుచుకుందామన్నారు.టీడీపీ ఇన్‌ఛార్జి జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని స్థానాలూ గెలిస్తేనే తిరుపతిలో భవిష్యత్తు రాజకీయాలు బాగుంటాయన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది తేలితే సులువుగా సర్దుబాట్లు చేసుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. జనసేన నేత కిరణ్ రాయల్ మాట్లాడుతూ రిజర్వేషన్ ప్రక్రియ త్వరగా పూర్తయితేనే క్షేత్రస్థాయిలో ఎన్నికలకు సన్నద్ధత సాధ్యమవుతుందన్నారు.టీడీపీ జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, బీజేపీ నేతలు కోలా ఆనంద్, దయానంద్, జనసేన సమన్వయ కమిటీ ఇన్‌ఛార్జి ధర్మరాజు, సభ్యులు కీర్తన, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
సమావేశాలు తప్ప కనిపించని పురోగతి
స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో కూటమి పార్టీల సమన్వయ సమావేశాలు వరుసగా జరుగుతున్నాయి. అయితే ఆ స్థాయిలో పార్టీల మధ్య సమన్వయం సాధించడంలో మాత్రం ఎలాంటి పురోగతీ కనిపించడం లేదు. మూడు పార్టీల సమన్వయ కమిటీల తొలి సమావేశం ఈనెల 15న తిరుపతిలో జరిగింది. దానికి ఏకంగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా హాజరయ్యారు. అంతకంటే ముందు ఈనెల 7న తిరుపతిలో, 9న విజయవాడలో జనసేన నేతల సమావేశాలు జరిగాయి. 11న తిరుపతిలో పార్లమెంటు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈనెల 16న జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. తాజాగా శనివారం మూడు పార్టీల సమావేశం జరిగింది. ఇన్ని సమావేశాలు జరిగినా క్షేత్రస్థాయిలో కార్యాచరణ కనిపించడం లేదు. అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల స్థాయిలో కూడా మూడు పార్టీల నేతలతో సమన్వయం కోసం వరుస సమావేశాలు జరపాలని అధిష్ఠానాలు ఆదేశించినా అమలు కావడం లేదు. రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో క్షేత్రస్థాయిలో ఆశావహులు స్పష్టమైన వైఖరితో ముందుకు రావడం లేదు. రిజర్వేషన్లు ఖరారై, ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏయే సీట్లు అనేది తేలితే గానీ ఆశావహులు పూర్తిస్థాయిలో పోటీకి సంసిద్ధత వ్యక్తం చేసే పరిస్థితి లేదు. సమన్వయ కమిటీలు అసెంబ్లీ నియోజకవర్గ, మండల స్థాయి పార్టీల కమిటీలతో, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తే తప్ప సమన్వయం, సయోధ్య, పరస్పర సహకారం వంటివి సాధ్యం కాని పరిస్థితులు నెలకొని వున్నాయి. అలా కాకుండా కేవలం ఇద్దరు ముగ్గురు నాయకులు మాత్రమే సమన్వయ కమిటీల పేరిట సమావేశాలు జరుపుతుండడం వల్ల కూటమి పార్టీలకు పెద్దగా ప్రయోజనం ఒనగూరేది లేదన్న అభిప్రాయం శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.