వెలుగొండల్లో చిరుతల సంచారం
ABN , Publish Date - Aug 19 , 2026 | 01:50 AM
రాపూరు వెలుగొండల్లో చిరుతలు సంచరిస్తున్నాయని ప్రయాణికులు జాగ్రత్త వహించాలని అటవీశాఖ అధికారి ధీరజ్ మంగళవారం హెచ్చరించారు.
అటవీశాఖ అధికారి ధీరజ్ హెచ్చరిక
చిట్వేలి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రాపూరు వెలుగొండల్లో చిరుతలు సంచరిస్తున్నాయని ప్రయాణికులు జాగ్రత్త వహించాలని అటవీశాఖ అధికారి ధీరజ్ మంగళవారం హెచ్చరించారు. నల్లమల శేషాచల కొండల కలయికతో ఆధ్యాత్మిక, పర్యాటక శోభను సంతరించుకున్న పెనుశిల అభయారణ్యంలో ఒక పెద్ద పులితోపాటు సుమారు 20 మేర చిరుతలు సంచరిస్తున్నాయన్నారు. మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో చిరుత పులులు ప్రధాన రహదారి, గోడలపై ప్రయాణికులకు కనిపించినట్లు సామాజిక మాధ్యమాల్లోని వీడియోలు వాస్తవమేనని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు, పశువుల కాపరులు ఘాట్ ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా ప్రయాణించవద్దని, అత్యవసరమైతే తప్ప రాత్రివేళల్లో ప్రయాణానికి దూరంగా ఉండటం మంచిదన్నారు. ఏదైనా ఇబ్బంది తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని.. వాటికి ఎలాంటి హాని చేయవద్దని ప్రజలకు ధీరజ్ విజ్ఞప్తి చేశారు.