Share News

ఐదుగురు రైతుల భూములకు విముక్తి

ABN , Publish Date - Jul 19 , 2026 | 01:27 AM

ఆవులపల్లె బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి సంబంధించిన 911.54 ఎకరాలకు ప్రభుత్వం విముక్తి కల్పించింది. సెక్షన్‌ 22ఎ(1)(బి) నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బాధిత రైతాంగం నుంచి హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.

 ఐదుగురు రైతుల భూములకు విముక్తి
ఆవులపల్లె వద్ద నిషేధిత జాబితా నుంచి తొలగించిన సెటిల్‌మెంట్‌ భూములు

కలెక్టర్‌ ఉత్తర్వులతో రైతుల్లో హర్షాతిరేకం

పుంగనూరు, జూలై18 (ఆంధ్రజ్యోతి): ఆవులపల్లె బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి సంబంధించిన 911.54 ఎకరాలకు ప్రభుత్వం విముక్తి కల్పించింది. సెక్షన్‌ 22ఎ(1)(బి) నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బాధిత రైతాంగం నుంచి హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. రిజర్వాయరు భూసేకరణకు రైతులు అడ్డుపడుతున్నారనే కక్షతో గత వైసీపీ ప్రభుత్వ హయంలో ఈ భూములను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే. మూడు పంటలు పండే భూములపై 55 మంది రైతులు న్యాయపోరాటం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు న్యాయం చేయాలని పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి నేతృత్వంలో సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్‌, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, నిమ్మల రామానాయుడు, సీసీఎల్‌ఏ, కలెక్టర్‌లను పలుమార్లు కలిశారు. దీంతో ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేసింది. ఈ మేరకు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఈ నెల 11న సర్వే నెంబరు 33/1 నుంచి 55 నెంబర్లకు సంబంధించి 911.54 ఎకరాల భూమిని సెక్షన్‌ 22ఎ(1)(బి)నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అలుపెరగని పోరాటం

వైసీపీ పాలనలో నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా రైతులు అలుపెరగని పోరాటం చేశారు. అన్నంపెట్టే పచ్చని పొలాలను వదులుకోలేక ఆవేదనతో కుమిలిపోయారు. 2020లో సోమల మండలం ఆవులపల్లె, పుంగనూరు మండలం నేతిగుట్లపల్లి, కురబలకోట మండలం ముదివేడు రిజర్వాయర్ల నిర్మాణానికి నాటి ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఆవులపల్లె రైతులు భూములివ్వవమని భీష్మించుకున్నారు. తమకే అడ్డుచెబుతారా అంటూ పోలీసు, ఫారెస్ట్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల ద్వారా రైతులను నానాబాధలు పెట్టారు. తప్పుడు సమాచారంతో ఫిర్యాదు చేయించి లోకాయుక్త ఆదేశాలంటూ 55 మంది రైతులకు చెందిన 911.54 ఎకరాలు 22ఏ జాబితాలో చేర్పించారు. దీంతో ఈ భూములపై పంట రుణాలు, 1బీ, ఇతర రెవెన్యూ రికార్డులు రాకుండా చేశారు. 2021లో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)కి ఈ ప్రాజెక్టుల నిర్మాణం నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రూ.100 కోట్లు జరిమానా కూడా విధించింది. అయినా వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడంతో కృష్ణాబోర్డుకు రూ.25 కోట్లు డిపాజిట్‌ చేసి పనులు నిలపాలని ఆదేశించింది. తర్వాత బాధిత రైతులు అనేక దౌర్జన్యాలు, కేసులు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బాధితుల్లో ఆశలు చిగురించాయి. ఈ క్రమంలోనే ఈ భూములకు 22ఏ నుంచి విముక్తి కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఇన్నాళ్లకు ప్రయత్నాలు ఫలించాయి

వైసీపీ పాలనలో నరకం చూశాం. ప్రాణాలు పోయినా భూములు వదలకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాం. అనేక దొంగ కేసులు ఎదుర్కొన్నాం. చాలా మంది బయటపడకుండా మద్దతు ఇచ్చారు. టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి ద్వారా సీఎం, మంత్రులు, కలెక్టర్‌, సీసీఎల్‌ఏ, సీఎంవో, ఆర్టీవోలు, అడ్వకేట్లు, అధికారులను కలిసి చేసిన ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయి. భూములు మాకే దక్కడం చాలా సంతోషంగా ఉంది.

- సోంపల్లె లక్ష్మీపతినాయుడు, చిన్నదేవళకుప్పం

Updated Date - Jul 19 , 2026 | 01:27 AM