పెద్దిరెడ్డి చెరలోని భూములకు విముక్తి
ABN , Publish Date - Nov 30 , 2026 | 01:42 AM
తిరుపతి నగరం ముత్యాలరెడ్డి పల్లెలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలో ఉన్న సుమారు 3.88 ఎకరాల బుగ్గమఠం భూముల స్వాధీనానికి అఽధికార యంత్రాంగం సిద్ధమైంది.
-నేడు బుగ్గమఠం భూముల స్వాధీనానికి అధికారుల చర్యలు
తిరుపతి(టీటీడీ), నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : తిరుపతి నగరం ముత్యాలరెడ్డి పల్లెలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలో ఉన్న సుమారు 3.88 ఎకరాల బుగ్గమఠం భూముల స్వాధీనానికి అఽధికార యంత్రాంగం సిద్ధమైంది. భూముల ఆక్రమణలకు సంబంధించి తనకు ఊరట నివ్వాలని కోరుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఆయనకు ఊరట లభించలేదు. దీంతో సోమవారం ఉదయం పెద్దిరెడ్డి ఆక్రమించిన భూముల్లో అనధికారిక కట్టడాలు తొలగించి భూములను స్వాధీనం చేసుకునేందుకు యంత్రాంగం సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతిలో బుగ్గమఠానికి మొత్తం 14.49 ఎకరాల భూమి ఉంది. అయితే భూమి ఆక్రమణకు గురైందని సర్వే చేసి హద్దులు చూపించాల్సిందిగా మఠం అధికారులు తిరుపతి ఆర్డీవోను కోరారు. 2025 మార్చిలో దేవదాయశాఖ అధికారులు పెద్దిరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. అయితే ఆ తర్వాత 2025 మేలో 10 రోజుల్లోగా ఆక్రమణలను తొలగించాలని బుగ్గమఠం అధికారులు ఆదేశింంచారు. పెద్దిరెడ్డికి సరైన వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వాలని, ఆయన అడిగిన సంబంధిత పత్రాలను అందించి, వివరణను పరిగణనలోకి తీసుకున్న తర్వాత విచారణ చేపట్టాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది.దీంతో బుగ్గమఠం ఆస్తుల సర్వే కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరో నలుగురికి దేవదాయశాఖ నోటీసులు జారీ చేసింది. 261/1, 261/2 సర్వే నంబర్లలోని మొత్తం 3.88 ఎకరాలు ఆక్రమించినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. గత ఏడాది డిస్ర్టిక్ట్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ల్యాండ్ సర్వే, దేవదాయశాఖ సహాయ కమిషనర్, బుగ్గమఠం ఈవోతో కలిసి బందోబస్తు నడుమ సర్వే నిర్వహించారు. ఈ సమయంలోనే బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాలు పెద్దిరెడ్డి ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. అయితే పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ఎండోమెంట్స్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించినా అక్కడ ఆయనకు ఊరట దక్కలేదు. దీంతో ఆక్రమణలను తొలగించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.