Share News

మల్లంగుంటలో కబ్జా పర్వం

ABN , Publish Date - Jun 27 , 2026 | 01:24 AM

తిరుపతి రూరల్‌ మండలం మల్లంగుంట గ్రామ పరిధిలో దాదాపు రూ.2కోట్ల ప్రభుత్వ భూమి సచివాలయం సాక్షిగా రెండవసారి కబ్జాకు గురవుతోంది.పీజీఆర్‌ఎ్‌సలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తహసీల్దార్‌ నోటీసులిచ్చినా లెక్కపెట్టలేదు. అక్రమ నిర్మాణానికి ‘వైట్‌వాష్‌’ వేసేసి మరీ వెక్కిరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

మల్లంగుంటలో కబ్జా పర్వం
అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు

రూ.2కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణ

నోటీసులిచ్చినా కొనసాగిన నిర్మాణాలు

తిరుపతి రూరల్‌, జూన్‌ 26(ఆంరఽధజ్యోతి): తిరుపతి రూరల్‌ మండలం మల్లంగుంట గ్రామ పరిధిలో దాదాపు రూ.2కోట్ల ప్రభుత్వ భూమి సచివాలయం సాక్షిగా రెండవసారి కబ్జాకు గురవుతోంది.పీజీఆర్‌ఎ్‌సలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తహసీల్దార్‌ నోటీసులిచ్చినా లెక్కపెట్టలేదు. అక్రమ నిర్మాణానికి ‘వైట్‌వాష్‌’ వేసేసి మరీ వెక్కిరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.మూడు నెలల ముందు కొందరు వ్యక్తులు ప్రభుత్వ స్థలాన్ని చదును చేస్తుంటే స్థానికుల సమాచారంతో రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ‘ఇది ప్రభుత్వ స్థలం’ అని హెచ్చరిక బోర్డు పెట్టి వెళ్లిపోయారు. నెలరోజులు గడవక ముందే సదరు స్థలంలో ఆక్రమణదారులు మళ్లీ పనులు మొదలుపెట్టారు. మళ్లీ ఫిర్యాదులు ఇవ్వడంతో తహసీల్దార్‌ నోటీసులిచ్చారు. అయినా ఆక్రమణదారులు పట్టించుకోలేదు. రెండ్రోజుల కిందట పూర్తిచేసిన నిర్మాణ గోడలకు తెల్లసున్నం కూడా కొట్టేశారు.

నోటీసులిచ్చినా..

మల్లంగుంట గ్రామం జాతీయ రహదారికి అతి సమీపంలో ఉండడం వల్ల ఇక్కడ భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. దీంతో కబ్జాదారులు ఖాళీగా కనిపించే ప్రభుత్వ భూములపై పడ్డారు. గ్రామ ముఖద్వారం సమీపంలో సర్వే నెంబరు 140లో 1.03 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఏడు సెంట్ల భూమిని పి.గోవిందయ్య ఆక్రమించుకున్నట్టు పీజీఆర్‌ఎ్‌సలో వచ్చిన ఫిర్యాదుల మేరకు రెవెన్యూ అధికారులు గుర్తించి నోటీసులు జారీచేశారు. అదేవిధంగా సర్వే నెంబరు 142లో 68 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంటే 10 సెంట్ల భూమికి పి.అరుణ్‌కుమార్‌ అనే వ్యక్తి ప్రహరీ నిర్మించుకున్నాడని తహసీల్దార్‌ నోటీసులు ఇచ్చారు. వీరితోపాటు పలువురు సదరు సర్వే నెంబర్లలో ఆక్రమణలకు దిగినట్టు తెలుస్తోంది. గతంలో వైసీపీలో ఉండి.. ఇప్పుడు అధికార పార్టీలోకి వచ్చిన కొందరి అండ చూసుకునే ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారన్న విమర్శలున్నాయి.ఈ విషయమై వీఆర్వో యోగానంద్‌ మాట్లాడుతూ భూ ఆక్రమణ చట్టం కింద గత నెల 15న తహసీల్దార్‌ నోటీసు జారీ చేసి ఆధారాలుంటే తీసుకుని రావాలని చెప్పారన్నారు. ఇప్పటివరకు ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకురాలేదని, తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లి రెండో నోటీస్‌ ఇచ్చి, నిర్మాణాలు తొలగిస్తామన్నారు

Updated Date - Jun 27 , 2026 | 01:24 AM