భూభారం... రూ.40 కోట్లు!
ABN , Publish Date - Jan 30 , 2026 | 02:46 AM
వచ్చే నెల 1 నుంచి పెరగనున్న భూ మార్కెట్ విలువలతో ప్రజలపై రూ.40 కోట్ల మేర రిజిస్ట్రేషన్ల భారం పడనుంది. పెరిగే మార్కెట్ ధరలపై సేల్ డీడ్‌కు రిజిస్ట్రేషన్ చార్జీలు 7.5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అన్నిచోట్ల చదరపు గజం రూపంలో, వ్యవసాయ భూములు ఎకరాల రూపంలో సబ్‌రిజిస్ట్రార్లు విలువల పెంపు నివేదికను సిద్ధం చేశారు.
మార్కెట్ విలువలపై ముగిసిన అభ్యంతరాల స్వీకరణ గడువు
పెంపు భయంతో ముందస్తుగా రిజిస్ట్రేషన్లు
నేడు, రేపు రికార్డు స్థాయిల్లో జరిగే అవకాశం
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 1 నుంచి పెరగనున్న భూ మార్కెట్ విలువలతో ప్రజలపై రూ.40 కోట్ల మేర రిజిస్ట్రేషన్ల భారం పడనుంది. పెరిగే మార్కెట్ ధరలపై సేల్ డీడ్‌కు రిజిస్ట్రేషన్ చార్జీలు 7.5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అన్నిచోట్ల చదరపు గజం రూపంలో, వ్యవసాయ భూములు ఎకరాల రూపంలో సబ్‌రిజిస్ట్రార్లు విలువల పెంపు నివేదికను సిద్ధం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 2019న ఒకసారి, కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో 2022 ఏప్రిల్‌లో కొంతమేర భూ మార్కెట్ విలువలు పెంచింది. 2023లో అక్కడక్కడా భూముల ధరలు సవరించిన ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో జిల్లావ్యాప్తంగా గ్రామీణ, అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో భూమార్కెట్ విలువలను సవరించింది. ఇప్పుడు ఫిబ్రవరి 1 నుంచి మరోసారి భూ విలువను పెంచనుంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణ గడువు గురువారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. 5-10 శాతం మేర భూవిలువలు పెంచుతూ తయారుచేసిన ప్రతిపాదిత నివేదికపై నగరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి మూడు అభ్యంతరాలు అందగా, ఇంకెక్కడా అభ్యంతరాలు రాలేదు. ఈ అభ్యంతరాలను నగరి ఎస్‌ఆర్ 24 గంటల్లో పరిష్కరిస్తారు. భూభారం పెంపు గడువుకు శుక్ర, శనివారాలు మాత్రమే ఉన్నాయి. ఫిబ్రవరి ఒకటి తర్వాత భూ విలువ పెంపు ప్రభావం రిజిస్ట్రేషన్ల ఖర్చుపై పడనుంది. అందుకని ఈలోపే రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి కక్షిదారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బుధవారం రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1.75 కోట్లు.. గురువారం సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం మేర రూ.60 లక్షలు ప్రభుత్వ ఖజానాకు అందింది. శుక్ర, శనివారాల్లో రద్దీ పెరగవచ్చన్న ఆలోచనతో ఆ రెండురోజులు స్లాట్ బుకింగ్ చేసుకున్నా, చేసుకోకపోయినా... అందరి డాక్యుమెంట్లు అర్ధరాత్రి వరకైనా రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సబ్‌రిజిస్ట్రార్లకు అధికారులు ఆదేశాలిచ్చారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. కాగా, భూ విలువపెంపుతో పెరగనున్న పెరిజిస్ట్రేషన్ చార్జీలు రియల్ ఎస్టేట్‌పై ప్రభావం చూపనుంది.