Share News

వెలమ అసోసియేషన్‌కు భూమి కేటాయింపు

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:46 AM

తిరుపతి రూరల్‌ మండలం దామినీడులో ఎకరా రూ.2.50 కోట్ల ధరతో ఎకరా భూమిని హైదరాబాదుకు చెందిన ఆలిండియా వెలమ అసోసియేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. వాస్తవానికి గతంలో సంబంధిత అసోసియేషన్‌ పెట్టుకున్న దరఖాస్తుపై దామినీడు గ్రామం సర్వే నంబరు 200-2లో ఎకరా ప్రభుత్వ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫ్రిబవరిలోనే కమ్యూనిటీ హాల్‌ తదితర నిర్మాణాలు చేపట్టేందుకు కేటాయించింది.

వెలమ అసోసియేషన్‌కు భూమి కేటాయింపు

దామినీడులో ఎకరా రూ. 2.50 కోట్ల ధరతో మంజూరు

తిరుపతి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): తిరుపతి రూరల్‌ మండలం దామినీడులో ఎకరా రూ.2.50 కోట్ల ధరతో ఎకరా భూమిని హైదరాబాదుకు చెందిన ఆలిండియా వెలమ అసోసియేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. వాస్తవానికి గతంలో సంబంధిత అసోసియేషన్‌ పెట్టుకున్న దరఖాస్తుపై దామినీడు గ్రామం సర్వే నంబరు 200-2లో ఎకరా ప్రభుత్వ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫ్రిబవరిలోనే కమ్యూనిటీ హాల్‌ తదితర నిర్మాణాలు చేపట్టేందుకు కేటాయించింది. అయితే అప్పట్లో ప్రభుత్వం భూమిని నేరుగా ఆలిండియా వెలమ అసోసియేషన్‌ పేరిట కాకుండా దేవదాయ శాఖ కమిషనర్‌ పేరిట కేటాయించింది. దేవదాయ శాఖ ద్వారా కమ్యూనిటీ హాల్‌ నిర్మించేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై వెలమ అసోసియేషన్‌ ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వానికి లేఖ రాసింది. సంబంధిత భూమిలో ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే నిర్మాణాలు చేపడతామని, ప్రతిపాదించిన ఉద్దేశానికే భూమిని వినియోగించుకుంటామని అందులో పేర్కొంది. దేవాదాయ శాఖ కమిషనర్‌ పేరిట కాకుండా భూమిపై తమకు పూర్తి హక్కులు వుండేలా కేటాయించాలని అభ్యర్థించింది. దీనిపై ఈనెల 18న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించిన మంత్రివర్గం వెలమ అసోసియేషన్‌ అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించింది.గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి వెలమ అసోసియేషన్‌ పేరిట భూమి కేటాయించాలని నిర్ణయించింది. దానికనుగుణంగా దామినీడులో ఎకరా ప్రభుత్వ భూమిని రూ. 2.50 కోట్ల ధరతో వెలమ అసోసియేషన్‌కు కేటాయిస్తూ రాష్ట్ర రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేటాయించిన భూమిని ఉద్దేశించిన అవసరాలకే వినియోగించాలని, ఏవైనా జల వనరులు, కాలువలు, వాగులు వంటివి వుంటే వాటిని యధాతధంగా సంరక్షించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.

Updated Date - Aug 22 , 2026 | 12:46 AM