ఆస్తి పన్ను రాయితీపై స్పందన కరువు
ABN , Publish Date - May 27 , 2026 | 12:58 AM
చిత్తూరు జిల్లాలోని పంచాయతీల్లో ఆస్తిపన్ను వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తాజా ఇంటి పన్ను డిమాండ్‌లో అసలు చెల్లిస్తే, ఐదు శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. అయినా 25 రోజుల్లో డిమాండ్‌లో రూ.5 కోట్లు మాత్రమే వసూలైంది.
ఇప్పటివరకూ వసూలైంది రూ.5 కోట్లు మాత్రమే
చిత్తూరు కలెక్టరేట్, మే 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పంచాయతీల్లో ఆస్తిపన్ను వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తాజా ఇంటి పన్ను డిమాండ్‌లో అసలు చెల్లిస్తే, ఐదు శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 1 నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. అయినా 25 రోజుల్లో డిమాండ్‌లో రూ.5 కోట్లు మాత్రమే వసూలైంది. పన్ను చెల్లింపుదారులకు రిబేటు లభిస్తుండగా... పంచాయతీలకు ఆదాయం సమకూరుతుంది. పంచాయతీల్లో తొలిసారిగా ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో అధికార యంత్రాంగం సరిగ్గా అవగాహన కల్పించకపోవడంతో గ్రామస్తులు సద్వినియోగం చేసుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మంచి అవకాశమని, పల్లెవాసులు సద్వినియోగం చేసుకోవాలని డీపీవో సుధాకర్ రావు కోరారు.
పక్కాగా నమోదు
స్వర్ణ గ్రామాల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి అసెస్మెంట్లను గుర్తించి ఆన్‌లైన్ చేశారు. వీటన్నిటినీ స్వర్ణ పంచాయతీ పోర్టల్ పరిధిలోకి తెచ్చారు. ఆన్‌లైన్ చెల్లింపులతో పారదర్శకతకు పెద్దపీట వేశారు. దీంతో గతేడాది రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు వచ్చాయి. పంచాయతీలకు ఆదాయం సమకూరింది. పన్ను వసూళ్ళలో జిల్లా 2024-25, 2025-26లలో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచింది.
అభివృద్ధికి బాటలు
పంచాయతీల పాలన ప్రత్యేక అధికారుల చేతిలో ఉంది. పల్లెలను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసేందుకు ఇది మంచి సమయం. ఇంటి పన్నుల ఆదాయం సమకూరితేనే అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుంటుంది. ఆర్థిక సంఘం నిధులు మినహాయిస్తే సొంత ఆదాయ వనరులు వున్న పంచాయతీలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. మిగిలిన వాటికి ఆస్తిపన్ను కీలకం. ఆదాయం పెంచే దిశగా అధికారులు చొరవ చూపాలి.
ఆస్తి పన్ను రాయితీపై స్పందన కరువు
ఇప్పటికి వసూలైంది రూ.5 కోట్లే
జిల్లాలో పంచాయతీలు : 621
చెల్లించాల్సిన ఆస్తిపన్ను : రూ.22.32 కోట్లు (పాత బకాయిలు మినహా)
ఈ నెల 25వ తేదీనాటికి వసూలైంది : రూ. 5 కోట్లు
వసూలు కావల్సింది : రూ.17.32 కోట్లు
మొత్తం అసెస్మెంట్లు : 2,80,107
పన్ను చెల్లించిన అసెస్సీదారులు : 5,600
చెల్లించాల్సిన వారు : 2,74,507