Share News

తెగని కుప్పం టీడీపీ ‘పంచాయతీ’!

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:56 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాకా కుప్పం నియోజకవర్గంలో సర్పంచ్‌ అభ్యర్థిత్వాలపై టీడీపీలో తీవ్ర పోటీ నడుస్తోంది. ఒక్కో పంచాయతీ నుంచి ముగ్గురు నుంచి ఏడెనిమిది మంది ఆశిస్తున్నారు.

తెగని కుప్పం టీడీపీ ‘పంచాయతీ’!
కుప్పం మండలం కొటాలూరు గ్రామసభలో మాట్లాడుతున్న పీఎ్‌సఎం (ఫైల్‌ ఫోటో)

సర్పంచ్‌ అభ్యర్థిత్వానికి తీవ్రమైన పోటీ

ఒత్తిడికి గురవుతున్న నియోజకవర్గ నేతలు

ఎంపీటీసీ ‘ఎంపిక’ తీరుపై అధినేత అసహనం

కుప్పం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాకా కుప్పం నియోజకవర్గంలో సర్పంచ్‌ అభ్యర్థిత్వాలపై టీడీపీలో తీవ్ర పోటీ నడుస్తోంది. ఒక్కో పంచాయతీ నుంచి ముగ్గురు నుంచి ఏడెనిమిది మంది ఆశిస్తున్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలో తెలియక నియోజకవర్గ నాయకత్వం ఒత్తిడికి గురవుతోంది. మరోవైపు ఇష్టారాజ్యంగా ‘ఎంపిక’లు జరిగినందువల్లే కుప్పం మున్సిపాలిటీతోపాటు, నాలుగు మండలాల్లోనూ మెజారిటీలు తగ్గాయని నమ్ముతున్న అధినేత, అసహనానికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపట్ల ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది.

నాయకుల్లో పెరుగుతున్న టెన్షన్‌

నియోజకవర్గంలో 93 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కుప్పం మండలంలో 29, గుడుపల్లెలో 18, శాంతిపురంలో 23, రామకుప్పం మండలంలో 23 పంచాయతీలున్నాయి. ననియాల తాండా పంచాయతీ పునర్విభన వ్యవహారం కోర్టు వివాదంలో ఉండడం వల్ల మిగిలిన 92 పంచాయతీలకూ ఈనెల 26న ఎన్నికలు జరుగుతాయి. ఈక్రమంలో అధికార టీడీపీలో సర్పంచ్‌ అభ్యర్థిత్వాల కోసం తీవ్రమైన పోటీ నడుస్తోంది. అభ్యర్థుల ఎంపికకు వారం పదిరోజులుగా నాయకులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఆశావహులను పార్టీ కార్యాలయాలకు పిలిపించి మాట్లాడుతున్నారు. నియోజకవర్గ నాయకత్వంలో మండలానికి ఒకరు చొప్పున పంచాయతీ ఎన్నికల ఇన్‌చార్జిలుగా పార్టీ నియమించింది. మండలాల వారీగా కుప్పానికి ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎ్‌స.మునిరత్నం, గుడుపల్లెకు సీఎం పీఏ శ్రీకాంత్‌, శాంతిపురానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, రామకుప్పానికి డాక్టర్‌ సురేష్‌ బాబు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. గ్రామ సభలు నిర్వహిస్తూ వీలైనంత వరకు ఏకగ్రీవం చేసి, పార్టీ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఫలితంచడంలేదు. పైగా ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. సర్పంచ్‌ అభ్యర్థిత్వం ఎంత పలికినా చెల్లించడానికి పలువురు అభ్యర్థులు సై అంటున్నారంటే పోటీ తీవ్రత అర్థమవుతుంది. ఒక్కో పంచాయతీలో ఒకరిద్దరికి మించి నామినేషన్లు పడే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.

పరిషత్‌ మెజారీటీపై అధినేత అసంతృప్తి

సర్పంచ్‌ అభ్యర్థి ఎంపిక నియోజకవర్గ నాయకత్వానికి పెను సవాలుగా మారింది. కేవలం ఎంపిక చేసి ఊరుకోవడం కాదు.. అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా వారిదే. ఈ విషయాన్ని అధినేత చంద్రబాబు ఇప్పటికే నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. నిజానికి మొన్న జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మెజారిటీలు ఆశించినంత రాకపోవడంపై ఆయన అసహనంగా ఉన్నారని తెలిసింది. అంతకుముందు జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం కొన్ని కౌన్సిలర్‌ స్థానాలలో మెజారిటీలు దిగజారడం తెలిసిందే. ఈ తీరుపై మండల పరిషత్‌ ఎన్నికలు ముగిసిన ఒకట్రెండు రోజులకు నియోజకకవర్గ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మెజారిటీలు తగ్గడం, కొన్ని స్థానాలలో ఏమవుతుందో తెలియని ఉత్కంఠ తలెత్తడంపె ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికలో నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి, తమకు ఇష్టులైన వారివైపే మొగ్గడం వల్లనే ఇలా జరిగినట్లు ఆయన అభిప్రాయపడ్డారని సమాచారం. ఈ కారణంగానే ఒకట్రెండు మండలాల విషయంలో నియోజకవర్గ నాయకుల ఇన్‌చార్జిగిరీలో మార్పులు జరిగాయని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘వేలంపాట’ ఎక్కువ పాడడం, ఇష్టుడై ఉండడం.. వంటి అర్హతలు కాకుండా గెలుపు గుర్రాలనే సర్పంచి అభ్యర్థులుగా ఎంపిక చేసి తీరాలన్న అధినేత ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్య ఇప్పుడు నియోజకవర్గ నాయకత్వంపై ఉంది.

Updated Date - Nov 15 , 2026 | 12:56 AM