Share News

కుప్పం.. ఇక సేఫ్‌ జోన్‌!

ABN , Publish Date - Sep 10 , 2026 | 02:02 AM

ఐపీఎస్‌ ఆఫీసర్‌ హేమంత్‌ను ఏఎస్పీగా నియమిస్తూ కూటమి ప్రభుత్వం తలవని తలంపుగా ఇచ్చిన ఉత్తర్వులు కుప్పంలో అక్రమార్కులకు షాక్‌కు గురిచేశాయి. డీఎస్పీ పోస్టు స్థానంలో ఏఎస్సీని నియమిస్తూ స్థానిక ఎన్నికల ముంగిటిలో జరుగుతున్న ఈ నియామకంతో ప్రతిపక్ష వైసీపీ అరాచక వాదం డైలమాలో పడింది. ఏకంగా ఐపీఎస్‌ అధికారి ఆ పోస్టులో నియమితులు కానుండడంతో చట్టం మరింత కఠినమై, శాంతిభద్రతల పరిరక్షణకు ఎన్నడూ లేనంత భరోసా ఇస్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కుప్పం.. ఇక సేఫ్‌ జోన్‌!
ఏఎస్పీ హేమంత్‌ బొడ్డు

  • ఏఎస్పీ నియామకంతో సర్దుకుంటున్న అక్రమార్కులు

  • డైలమాలో పడ్డ వైసీపీ అరాచకవాదం

  • శాంతియుతంగా స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం

కుప్పం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఐపీఎస్‌ ఆఫీసర్‌ హేమంత్‌ను ఏఎస్పీగా నియమిస్తూ కూటమి ప్రభుత్వం తలవని తలంపుగా ఇచ్చిన ఉత్తర్వులు కుప్పంలో అక్రమార్కులకు షాక్‌కు గురిచేశాయి. డీఎస్పీ పోస్టు స్థానంలో ఏఎస్సీని నియమిస్తూ స్థానిక ఎన్నికల ముంగిటిలో జరుగుతున్న ఈ నియామకంతో ప్రతిపక్ష వైసీపీ అరాచక వాదం డైలమాలో పడింది. ఏకంగా ఐపీఎస్‌ అధికారి ఆ పోస్టులో నియమితులు కానుండడంతో చట్టం మరింత కఠినమై, శాంతిభద్రతల పరిరక్షణకు ఎన్నడూ లేనంత భరోసా ఇస్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గత వైసీపీ హయాంలో క్వారీ, ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా విచ్చలవిడిగా సాగేది. అప్పట్లో జరిగిన పంచాయతీ, పరిషత్తు ఎన్నికల్లో అధికార వైసీపీ దాడులు, దౌర్జన్యాలతో, బలవంతపు ఏకగ్రీవాలతో విజయం సొంతం చేసుకుంది. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లోనూ విధ్వంసం కొనసాగించింది. బెదిరింపులు, కిడ్నా్‌పలు, అక్రమ కేసులతో టీడీపీ కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా వేధింపులకు గురయ్యారు. వీటికి పోలీసు అధికారులు సహకరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రశాంతంగా ఉన్న కుప్పంలో ఎన్నడూ లేనంతగా శాంతిభద్రతలు క్షీణదశకు చేరుకున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక కుప్పం మున్సిపాలిటీతోపాటు కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాలను ప్రత్యేక డివిజన్‌గా చేసి, డీఎస్పీ పోస్టును మంజూరు చేసి అధికారిని కూడా నియమించింది.

తగ్గని అరాచకం

డీఎస్పీ నియామకం.. అఽధికార మార్పిడి జరిగినా వైసీపీ ప్రభుత్వంనాటి అరాచక ప్రభావం కొంతమాత్రమే తగ్గింది. క్వారీ, ఇసుక, మట్టి అక్రమ రవాణాతోపాటు గంజాయి అక్రమ రవాణా, దొంగచాటుగా యువతకు చేరవేయడం వంటి అక్రమాలు చాలావరకు కొనసాగుతూ వచ్చాయి. అధికార, ప్రతిపక్షాలనే తేడా లేకుండా కొంతమంది నాయకులు క్షేత్రస్థాయిలో ఈ అక్రమాలకు బాధ్యులుగా ఉంటూ వచ్చారు. ఈ విషయంలో పోలీసు శాఖ చూసీచూడనట్లు పోయిందన్న విమర్శలు వినిపించాయి. ఒత్తిళ్లకు, మొహమాటాలకు లొంగిపోయి బాధ్యతా నిర్వహణలో పోలీసు అధికారులు మెతకదనం చూపుతున్నారన్న భావన ప్రజల్లో ఏర్పడింది. కొన్ని నెలల క్రితం సీఎం చంద్రబాబు పార్టీ కేడర్‌తో, అధికార యంత్రాంగంతో నేరుగా నిర్వహించిన కుప్పం నియోజకవర్గ సమీక్షలో పోలీసు అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు అక్రమ క్వారీయింగ్‌, ఇసుక, మట్టి అక్రమ రవాణా, స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. కేసులు నమోదు చేయడంతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖలకు వాటిని అప్పగించారు. ఆ తర్వాత ఈ చర్యలు తగ్గుముఖం పట్టాయి.

స్థానిక ఎన్నికల రచ్చ

ఇదిలా ఉండగానే కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. అఽధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటు చేసుకోవడం ప్రారంభించాయి. మరోవైపు వైసీపీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ భరత్‌ చేసిన ‘చంపడాలు, నరకడాలు, రక్తాభిషేకాలు’ అనే వ్యాఖ్యలు పార్టీ కేడర్‌ను రెచ్చగొట్టాయి. ఇటు టీడీపీలోనూ ఆ వ్యాఖ్యలు తీవ్రమైన ఆగ్రహావేశాలను రగుల్కొల్పింది. అంతదాకా వస్తే తామూ తెగించి పోరాడతామని ప్రతి సవాళ్లు విసురుతున్నారు. ప్రతిపక్ష పార్టీ తనకు సహజమైన అరాచకాన్ని కుప్పంలో ఎగదోసి వేడుక చూసేందుకు ఎప్పటినుంచో కుట్రలు చేస్తోందన్న అనుమానాలు ఈ ఘటనతో బలపడ్డాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. రెండు పార్టీల ర్యాలీలు, సభలు, సమావేశాలతో కుప్పం హోరెత్తిపోతోంది.

ఏఎస్పీ నియామకం అందుకే

కుప్పంలో జరుగుతున్న పరిణామాలను అధినేత చంద్రబాబు జాగ్రత్తగా గమనిస్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ కేడర్‌తో సమీక్షిస్తున్న ఆయన, శాంతిభద్రతల క్షీణతను పసిగట్టారు. స్థానిక ఎన్నికల వేళ అరాచకం ప్రబలి శాంతిభద్రతలు క్షీణిస్తే, అక్రమార్కులు చెలరేగిపోతే ఇటు ప్రభుత్వానికి చెడ్డపేరు రావడమే కాక, ప్రజల్లో అభద్రతా భావం పెరిగిపోతుందని భావించారేమో తెలియదు. అంతిమంగా ఇది ప్రజాస్వామ్య విఘాతానికి దారి తీస్తుంది. దీంతో రెండు రోజుల కిందట హఠాత్తుగా ఎవరూ ఊహించని తరుణంలో డీఎస్పీ స్థానంలో ఏఎస్పీగా బొడ్డు హేమంత్‌ (ఐపీఎ్‌స)ను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏఎస్పీ పోస్టు మంజూరు చేస్తారన్న ఊహాగానాలు ఎప్పటినుంచో సాగుతూనే ఉన్నా, అదింత తొందరగా జరుగుతుందని ఎవరూ అనుకోలేదు. 2023 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హేమంత్‌ బొడ్డు చింతూరు ఏఎస్పీగా ఉంటూ కుప్పం బదిలీ అయ్యారు. అంతకుముందు ఆయన గ్రేహౌండ్స్‌లో సాల్ట్‌ కమాండర్‌గా పనిచేశారు. స్ట్రిక్ట్‌ యువ ఆఫీసర్‌గా పేరుపడ్డ హేమంత్‌ను సీఎం చంద్రబాబు కోరి ఇక్కడకు పంపారు. ఆయన ఆధ్వర్యంలో పోలీసు శాఖ బలోపేతమై అటు అక్రమార్కులపైనా, ఇటు రాజకీయ అరాచకవాదంపైనా ఉక్కుపాదం మోపుతుందన్న నమ్మకంతోనే ఈ నియామకం జరిగింది. భవిష్యత్తులో ఏఎస్పీగా హేమంత్‌ తీసుకోనున్న కఠినమైన చర్యలతో కుప్పం సేఫ్‌ జోన్‌గా మారుతుందని ప్రజలూ ప్రస్తుతానికి నమ్మకం పెట్టుకున్నారు.

Updated Date - Sep 10 , 2026 | 02:02 AM