మదనపల్లెకు కృష్ణాజలాలు
ABN , Publish Date - Sep 16 , 2026 | 02:01 AM
తాగునీటి ఎద్దడి తీర్చేందుకు వడివడిగా చర్యలు ఎత్తిపోతల పథకం ద్వారా తరలింపు
మదనపల్లె టౌన్, ఆంధ్రజ్యోతి: అన్నమయ్య జిల్లా కేంద్రానికి కృష్ణా జలాలు చేరనున్నాయి. ప్రజల దాహార్తిని తీర్చనున్నాయి. ఇప్పటికే ఎన్‌నినోతో బోర్లు ఎండిపోయాయి.. పట్టణంలో తాగునీటి ఎద్దడి ముంచుకు వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ముందస్తుగా స్పందించారు. అధికారులతో చర్చించి అప్రమత్తం చేశారు. హంద్రీనీవా సొరంగం నుంచి కృష్ణా జలాలను 1,500మీటర్ల పైనున్న అమ్మచెరువుకు ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించేందుకు ప్రణాళిక రూపొందించారు. సుమారు అరలక్ష జనాభాకు తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మదనపల్లెవాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణాజలాలను తరలించేందుకు చర్యలు మొదలయ్యాయి. పట్టణానికి పడమర దిశలో హంద్రీనీవా కాలువ వెళుతోంది. ఈ కాలువ కాట్లాటపల్లె నుంచి రామిరెడ్డిగారిపల్లె మధ్య వున్న గుట్టకింది భాగంలో 2.5 కిలోమీటర్ల పొడవైన సొరంగం ద్వారా వెళ్లి చిప్పిలి సమ్మర్ స్టోరేజి ట్యాంకులో కలుస్తుంది. పట్టణం ఏడు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించడంతో ఉత్తరం వైపున నీరుగట్టువారిపల్లె, కోళ్లబైలు-2 పంచాయతీ, అనపగుట్ట, చీకిలగుట్ట, చౌడేశ్వరినగర్ ప్రాంతాలకు నీరు అందించాలని సంకల్పించారు. ఇందుకు కలెక్టర్ నిశాంత్‌కుమార్ సహకారంతో ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. హంద్రీనీవా సొరంగం నుంచి నీటిని తోడి ఎగువున వున్న అమ్మచెరువుకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటి మళ్లించాలని నిర్ణయించారు. ఈ పనులకు మున్సిపల్‌శాఖ రూ.32లక్షలు మంజూరు చేసింది. కోళ్లబైలు టీడీపీ ఇన్‌చార్జి రాటకొండ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
నీటిని తరలిస్తారిలా..
హంద్రీనీవా సొరంగంలో పెద్ద సిమెంటు బెడ్ వేసి దానిపై నాలుగు 20 హెచ్‌పీ మోటార్లను అమర్చారు. ఇన్‌వెల్ మోటార్లుల హంద్రీనీవా నీటిని తోడి రెండు పైప్‌లైన్‌ల ద్వారా 1.5 కిలోమీటర్ల ఎగువకు నీటిని పంపింగ్ చేస్తాయి. 10 ఇంచీల వెడల్లు ఉన్న రెండు వేల పైపులను సొరంగం నుంచి కోళ్లబైలు-2 పంచాయతీలోని అమ్మచెరువు కాలువకు అనుసంధానం చేస్తున్నారు. నాలుగు మోటార్లు పనిచేసేందుకు కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్‌నే ఏర్పాటు చేశారు. నిరంతర విద్యుత్ సరఫరాతో నాలుగు మోటార్లు నీటిని ఎగువకు పంపింగ్ చేస్తాయి. అమ్మచెరువుకు నీటి అందించేలా సప్లైచానెల్ వరకు ఈ పైప్‌లైన్‌లు వేస్తున్నారు.
16 చెరువులకు హంద్రీనీవా జలాలు
మదనపల్లెలోని 50వేల మంది జనాబాకు తాగునీరు అందించడమే కాక, పట్టణానికి తూర్పున దిగువున ఉన్న 16 చెరువులకు హంద్రీనీవా జలాలు అందించడానికి ఈ బృహత్తర ప్రణాళిక ఉపకరించనుంది. అమ్మచెరువుకు హంద్రీనీవా నీరు చేరి చెరువు నిండితే, ఈ మొరవ ద్వారా దిగువున తట్టివారిపల్లె(లింగిశెట్టిచెరువు), ఇసుకునూతిపల్లె చెరువు, స్వామి చెరువు, బసినికొండ చెరువుతో పాటు 11చెరువులకు జలాలు చేరేలా అధికారులు ముందస్తు ప్రణాళిలతో పనిచేస్తున్నారు. అంతా సవ్యంగా జరిగితే మరో వారం రోజుల్లో మదనపల్లె చుట్టుపక్కల చెరువులన్నీ హంద్రీనీవా జలాలతో నిండనున్నాయి.
అమ్మచెరువు నుంచి నాలుగు సంపులకు నీటిని పంపుతాము..
హంద్రీనీవా జలాలు అమ్మచెరువుకు చేరితే దిగువున వున్న బోర్లు రీచార్జి అవుతాయి. దీంతో పాటు అదనంగా బోర్లు డ్రిల్ చేసి అందులో నుంచి నీటిని రామిరెడ్డిలేఅవుట్, నీరుగట్టువారిపల్లె ప్రాంతాల్లోని నాలుగు సంపులకు నీటిని సరఫరా చేస్తాం. అక్కడి నుంచి కుళాయిల ద్వారా ప్రజలకు నీరు అందిస్తాం. రెండు రోజుల్లో పైప్‌లైను, పంపింగ్ పనులన్నీ పూర్తి చేసి, కృష్ణా జలాలను అమ్మచెరువుకు తీసుకొస్తాం.
ప్రమీల, మున్సిపల్ కమిషనర్, మదనపల్లె.