చెర్లోపల్లెకు కృష్ణా జలాలు..!
ABN , Publish Date - Aug 27 , 2026 | 01:32 AM
సెప్టెంబరు 10న జిల్లాకు నీరు విడుదల తాగునీరు, పరిశ్రమలకే ప్రాధాన్యం పీబీసీ, కేబీసీలలో 50 చెరువులు నింపేలా చర్యలు
మదనపల్లె, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉన్నా ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలలో అడపాదడపా కురిసిన వర్షాలతో కృష్ణమ్మలో కదలికి వచ్చింది. కర్నూలు జిల్లా శ్రీశైలంలోని ఎగువ ప్రాంతమైన మాల్యాల నుంచి నీటిపంపింగ్ ప్రారంభమైంది. ఆ నీరంతా అనంతపురం జిల్లాలోని జీడిపల్లె రిజర్వాయర్ దాటి సత్యసాయి జిల్లాలోని కదిరి సమీపంలోని చెర్లోపల్లె రిజర్వాయర్‌కు చేరుతున్నాయి. అక్కడి నుంచి వచ్చేనెల 10న హంద్రీ-నీవా జలాలను జిల్లాకు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పుంగనూరు బ్రాంచి కెనాల్ ద్వారా తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాలకు, కుప్పం బ్రాంచి కెనాల్ ద్వారా పలమనేరు, కుప్పం నియోజకర్గాలకు కృష్ణా జలాలను పారించనున్నారు.
10వ తేదీకి వచ్చేలా చర్యలు
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాను కరువుచాయలు కమ్మేస్తున్నాయి. చెరువులు, కుంటలు, వ్యవసాయబోర్లు అడుగంటి సాగునీటితోపాటు తాగునీటికి కూడా ఇబ్బందులు ఆరంభమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కృష్ణా జలాలను ముందుస్తుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చే చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా మాల్యాల నుంచి ప్రారంభమైన నీటి పంపింగ్ ఈనెల 11వ తేదీన కృష్ణమ్మ జీడిపల్లె రిజర్వాయర్‌కు చేరుకుంది. అక్కడి నుంచి హంద్రీ-నీవా ప్రధాన కాలువ ద్వారా కదిరి సమీపంలోని చెర్లోపల్లె రిజర్వాయర్‌కు మూడు రోజులుగా కృష్ణా జలాలు వస్తున్నాయి. శ్రీశైలం నుంచి 3వేల క్యూసెక్కులు తీసుకుంటుండగా అటు కర్నూలు, ఇటు అనంతపురం జిల్లాలోని మధ్యలోని రిజర్వాయర్లకు పోను జీడిపల్లెకు 2వేలు క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. అక్కడి నుంచి దిగువ ప్రాంతానికి 1,100 క్యూసెక్కులు వస్తుండగా, మార్గమధ్యలోని మడకశిర బ్రాంచి కెనాల్‌పై ఉన్న గొల్లపల్లె, మారాల రిజర్వాయర్లకు 400 క్యూసెక్కులు పోగా చెర్లోపల్లెకు 500 క్యూసెక్కులు వస్తుండగా మిగిలిన 200 క్యూసెక్కుల సరఫరాలో నష్టాలు, ఆవిరి, తదితర రూపాల్లో తగ్గిపోతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇదిలావుండగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ప్రధాన మార్గంతోపాటు సోర్సుగా చెప్పుకునే చెర్లోపల్లె రిజర్వాయర్ 1.618 టీఎంసీల సామర్థ్యం కాగా ప్రస్తుతం 0.500 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. ఇక ఒక టీఎంసీ లేదా అంతకు మించి 1.200టీఎంసీలు రాగానే పుంగనూరు బ్రాంచి కెనాల్‌కు విడుదల చేయనున్నారు. ఇందుకు కనీసం పది నుంచి 12 రోజులు పట్టే అవకాశం ఉందని, సెప్టెంబర్ 10వ తేదీకి పైన నీటి విడుదలకు హంద్రీ-నీవా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఎక్కువ భాగం తాగునీరు, పరిశ్రమలకే..
2026-27 ఏడాదిలో హంద్రీ-నీవా జలాలను కేవలం తాగునీరు, పరిశ్రమలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలోని కియా కంపెనీ, గొల్లపల్లె ఏరియాలలోని ఏపీఐఐసీ, ప్రైవేటు పరిశ్రమలకు సరఫరా చేయనున్నారు. అలాగే జిల్లాలో మదనపల్లెలోని చిప్పిలి, గుట్టకిందపల్లె, పుంగనూరులోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను మొదట నింపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పుంగనూరు బ్రాంచి కెనాల్, కుప్పం బ్రాంచి కెనాల్‌లోని కుప్పం వరకూ కాలువకు మొదటగా ఉన్న చెరువులను నింపాలన్నా కలెక్టర్ సూచనలనూ పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇందులో భాగంగా ఈ రెండు బ్రాంచి కెనాల్స్‌పై మూడు ఎస్.ఎ్‌స.ట్యాంకులతోపాటు 50 చెరువులు నింపేలా అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు.
ఇది తొమ్మిదోసారి..
హంద్రీ-నీవా మొదటి, రెండో విడత పనులు పూర్తయ్యాక జిల్లాకు కృష్ణా జలాలు రావడం ఇదితొమ్మిదోసారి. మొదటగా 2018 డిసెంబర్ 7వ తేదీ నుంచి 2019 ఏప్రిల్ 21వ తేదీ వరకు, 2019 అక్టోబరు 8నుంచి 2020 మార్చి 21 వరకూ, 2020 సెప్టెంబరు 22 నుంచి 2021 ఏప్రిల్ 10వ తేదీ వరకు, 2021 సెప్టెంబరు 7 నుంచి 2021 డిసెంబరు 20వ తేదీ వరకు కృష్ణమ్మ ప్రవాహం కొనసాగింది. అలాగే 2022 ఆగస్టు 20 నుంచి 2022 అక్టోబరు 15వరకు, 2023 సెప్టెంబరు 26 నుంచి 2024 మార్చి ఒకటో తేదీ వరకు, తిరిగి 2024 అక్టోబరు 12 నుంచి 2024 డిసెంబరు 20వ తేదీ వరకు, హంద్రీ-నీవా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2025 ఆగస్టు 21వ తేదీ నుంచి 2026 ఏప్రిల్ 12వ తేదీ వరకూ ఎనిమిది నెలలు కృష్ణా జలాలు నిరంతరం ప్రవహించాయి.