వర్షాభావంలో కృష్ణా జలాల పలకరింత
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:55 AM
ఎల్‌నినోతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో కృష్ణాజలాలతో రామకుప్పం చెరువులు కళకళలాడుతున్నాయి.
రామకుప్పం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినోతో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో కృష్ణాజలాలతో రామకుప్పం చెరువులు కళకళలాడుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో చివరిదైన పరమసముద్రం చెరువుకు జలాలు చేరుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆ చెరువు నిండాక ప్రాధాన్యత క్రమంలో మిగిలిన వాటిని నింపాలని నిర్ణయించారు. అయితే గత నెల 26న గుండిశెట్టిపల్లె వద్ద అండర్‌గ్రౌండ్ కెనాల్ వద్ద జలప్రవాహానికి అంతరాయం కలిగింది. దానిని క్లియర్ చేసే వరకు జలాలను రామకుప్పం మండలం చింతకుప్పంలోని జిల్లాని చెరువుకు మళ్లించారు. ఆ చెరువు పూర్తిగా నిండి పది రోజులుగా మొరవ పారుతోంది. మొరవ జలాలు కెంచనబల్ల తోట్ల చెరువు వైపు పరుగులు తీస్తున్నాయి. మంగళవారం నాటికి తోట్లచెరువులో సగభాగం నిండింది. రెండు మూడు రోజుల్లో ఈ చెరువు కూడా మొరవ పారనుంది. వర్షాభావ పరిస్థితుల్లో బోర్లలో జలమట్టాలు తగ్గిన నేపథ్యంలో ఈ జలాల చేరిక ప్రజల్లో సంతోషాన్ని నింపుతోంది. ఈ నీటి ఫలితంగా ఇప్పటికే బోర్లలో జలమట్టాలు పెరిగినట్టు రైతులు తెలిపారు. తోట్లచెరువు మొరవ పారితే జలాలు తమిళనాడుకు చేరుతాయి. వృథాగా జలాలు తమిళనాడుకు పోకుండా తోట్లచెరువు కింది భాగంలో ఉన్న చెక్‌డ్యాంలను పటిష్టం చేస్తూ, అవసపరమైన చోట మరిన్న చెక్‌డ్యాంలు నిర్మిస్తే తమకు సౌకర్యంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు