యువకుడిని చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరించి
ABN , Publish Date - Jun 30 , 2026 | 01:11 AM
వివాహేతర సంబంధంపై అనుమానంతో హత్య నిందితుడి అరెస్టు
చిత్తూరు రూరల్, జూన్ 29(ఆంధ్రజ్యోతి): తన భార్యతో వివాహేతర సంబంధముందన్న అనుమానం.. ఆగ్రహంగా మారి హత్య చేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన చిత్తూరు రూరల్ మండలంకుర్చివేడులోని ఓ మామిడితోపులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బీఎన్‌ఆర్ పేట ఇన్‌చార్జ్ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన ప్రకారం.. చిత్తూరు రూరల్ మండలం పాలంతోపు ఎస్టీ కాలనీకి చెందిన వెంకటే్‌ష(19)కు తన భార్యతో సన్నిహిత సంబంధం ఉందని గుడిపాల రామాపురానికి చెందిన వడివేలు అనుమానిస్తూ వచ్చాడు. వడివేలు దంపతులు మూడు నెలలుగా కుర్చివేడులోని గోవర్ధన్ మామిడితోటలో కాపలా ఉంటున్నారు. ఆ తోట వద్దకు ఆదివారం రాత్రి వెంకటేష్ వెళ్లాడు. అందరూ కలిసి చికెన్ వండుకుని తిని.. మద్యం తాగారు. అనంతరం వెంకటే్‌షను ఇంటికి వెళ్లమని చెప్పిన వడివేలు.. అతడితో వివాహేతర సంబంధంపై తన భార్యను నిలదీశాడు. అదికాస్త గొడవకు దారితీయడంతో ఆమెపై చేయిచేసుకున్నాడు. దీన్నంతా తోటలోనే ఉండి గమనించిన వెంకటేష్.. తిరిగి అక్కడికి వచ్చి గొడవను అడ్డుకున్నాడు. దీంతో వడివేలులో పేరుకుపోయిన అనుమానం.. ఆగ్రహంగా మారింది. వెంకటే్‌షపై దాడి చేశాడు. ఇంట్లో ఉన్న చీర తీసుకొచ్చి అతడి మెడకు బిగించి హత్య చేశాడు. ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశాడు. ఏమీ తెలియనట్లు సోమవారం ఉదయం గ్రామస్తుల ముందు వడివేలు నటించసాగాడు. బీఎన్‌ఆర్ పేట పోలీసుల విచారణలో వడివేలు ప్రవర్తన, మృతదేహంపై గాయాలు, అక్కడి పరిస్థితిని పరిశీలించాక పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో వడివేలును విచారించగా, తానే హత్యచేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాపుత చేపట్టారు.