Share News

చెరువు పనులకు పోటాపోటీ

ABN , Publish Date - Jun 14 , 2026 | 01:42 AM

చెరువుల అభివృద్ధి పనులకు టెండర్ల మొదటి ప్రక్రియ ముగిసింది. తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో తొమ్మిది చెరువు పనులకుగాను శనివారం ఫైజ్‌ బిడ్‌ ఓపెన్‌ చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు పనుల్లో ఒక్కొక్క పనికి ఐదుగురు పోటీ పడగా, మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రంలో మూడు పనులకు ఒకే ఒక్కరు టెండర్‌ వేశారు.

చెరువు పనులకు పోటాపోటీ
మదనపల్లెలోని ఇరిగేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రధాన కార్యాలయం

తంబళ్లపల్లె సెగ్మెంట్‌లో టెండర్లు ఖరారు

రామసముద్రంలో ఒకే ఒక్కడు

ఆ లెస్‌తో పనులు చెసేదెలా?

మదనపల్లె, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): చెరువుల అభివృద్ధి పనులకు టెండర్ల మొదటి ప్రక్రియ ముగిసింది. తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో తొమ్మిది చెరువు పనులకుగాను శనివారం ఫైజ్‌ బిడ్‌ ఓపెన్‌ చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు పనుల్లో ఒక్కొక్క పనికి ఐదుగురు పోటీ పడగా, మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రంలో మూడు పనులకు ఒకే ఒక్కరు టెండర్‌ వేశారు. కురబలకోట మండలంలోని మూడు చెరువుల్లో కాంట్రాక్టర్లు హరినాథ్‌రెడ్డి రెండు, శ్రీనివాసులు ఒకటి దక్కించుకున్నారు. అలాగే పెద్దమండ్యం, బి.కొత్తకోట మండలాల్లోని ఆరు చెరువులను విశ్వనాథ్‌రెడ్డి ఒక్కడే కైవసం చేసుకున్నారు. వీరిలో హరినాథ్‌రెడ్డి అంచనా రేటులో 17శాతం లెస్‌కు, శ్రీనివాసులు 20శాతం, విశ్వనాథ్‌రెడ్డి 21 శాతం ఈ పనులు దక్కించుకున్నారు. ఇక రామసముద్రం మండలంలోని మూడు చెరువులకు పోటీ లేదు. రామసముద్రానికి చెందిన మహేశ్వర్‌రెడ్డి 0.01శాతం లెస్‌తో మూడు చెరువు పనులను దక్కించుకున్నారు. ఇక్కడ కాంట్రాక్టర్లు రింగ్‌ కావడంతో పోటీ లేదని స్పష్టమవుతోంది. ఇక నీటిపారుదల శాఖలో కలికిరిలో పనిచేస్తున్న ఓ ఏఈ పనుల కైవశానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కలికిరికి చెందిన ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నుంచి కురబలకోట, బి.కొత్తకోట మండలాల్లో టెండర్లు వేయించినట్లు చెబుతున్నారు. అయితే ఊహించని విధంగా పోటీ కాంట్రాక్టర్లు 15శాతం లెస్‌ను దాటి 17, 20శాతం నమోదు చేయడంతో వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఇక రెండు మండలాల్లో అత్యధికంగా లెస్‌కు టెండర్‌ కోట్‌ చేసి ఆరు పనులు దక్కించుకున్న విశ్వనాథ్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పనులు చేస్తారా? లేక అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు డిమాండ్‌, నీటిపారుదలశాఖ అధికారుల పైరవీలతో తప్పుకుంటారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆ మేరకు ఆ శాఖలో కీలకంగా మారిన ఏఈ ఇప్పటికే బేరసారాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇక రామసముద్రం మండలంలోని మూడు పనులకు ఒకే నామినేషన్‌ దాఖలు కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా పోటీ లేకుండా సింగిల్‌ టెండర్‌ నమోదు చేస్తే తిరిగి మరోసారి టెండర్లకు వెళ్తుంటారు. కానీ ఇక్కడ రీ-టెండర్‌కు వెళ్తారా? లేక సింగిల్‌ టెండర్‌నే ఆమోదిస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

పనుల కేటాయింపులో అన్యాయం

తంబళ్లపల్లె నియోజకవర్గంలో చెరువుల మరమ్మతులు(ఆపరేషన్‌ అండ్‌ మెయిన్‌ టెనెన్స్‌) పనులు కేటాయించడంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఆరు మండలాల్లో ఇద్దరు ఏఈలు పనులు చేస్తుండగా ఇందులో ఒక ఏఈ చూస్తున్న కురబలకోట, బి.కొత్తకోట, పెద్దమండ్యం మండలాలకు మూడు చొప్పున తొమ్మిది చెరువులకు నిధులు మంజూరు చేయగా, తంబళ్లపల్లె, ములకలచెరువు, పీటీఎం మండలాలు చూస్తున్న మరో ఏఈకి మండలానికి ఒకటి, రెండు చొప్పున ఐదు చెరువు పనులు మాత్రమే మంజూరు చేశారు. అది కూడా ఆ మూడు మండలాలకు కాంట్రాక్టర్లు చేసే పనులు కాగా, ఈయనకు మాత్రం సాగునీటి సంఘాల చైర్మన్లు చేసే పనులు కేటాయించారు. మరోవైపు ములకలచెరువు మండలం చూస్తున్న ఏఈకి ఆ మండలంలో గతేడాది సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు జవకలచెరువు, నాయనచెరువు, చిన్నమ్మచెరువు, కొత్తకుంట, అడవినాయునిచెరువులు తెగిపోయాయి. వీటికి మరమ్మతులు చేపట్టాలని అప్పట్లోనే రెండుసార్లు ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదు. అక్కడి ఉన్నధికారులు కూడా ఆయన చెప్పినట్లే తలూపుతున్నట్లు నీటిపారుదలశాఖలో విమర్శలు వెల్లువెతున్నాయి.

అంత లెస్‌కు పనులు చేసేదెలా?

కాంట్రాక్టర్లు పోటీ పడి ఇష్టానుసారం ఎక్కువలె్‌సకు టెండర్‌ కోట్‌ చేస్తున్నారు. అయితే పనులు ఎంత నాణ్యతతో చేస్తారో ఇట్లే చెప్పేయవచ్చు. చెరువుకట్టను బలపర్చాలంటే మట్టిని తోలే రెండు మూడు లేయర్లకూ నీటిని పడుతూ కంప్రైజర్‌తో గట్టిగా తొక్కించాలి. అప్పుడే రెండు అడుగుల ఎత్తుఉన్న మట్టి ఒక అడుగుకు వస్తుంది. కానీ ఏఈ, డీఈలు క్షేత్రస్థాయిలో ఏమీ పట్టించుకోకుండా కాంట్రాక్టర్లకు వదిలేస్తున్నారు. ఫలితంగా పనుల నిర్వహణలో ప్రమాణాలు, నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. ఉదాహరణకు రూ.10లక్షల అంచనా విలువతో పని మంజూరు చేస్తే సీనరైజ్‌ ఛార్జీలు, కన్సిడరేషన్‌ ఛార్జ్జీలు, మెరిట్‌, డీఎంఎఫ్‌ తదితర ఛార్జీల పేరుతో రూ.3.50లక్షల మేర కోతలు పోతాయి. ఇక పని రూ.6.50లక్షలకు కాంట్రాక్టర్‌కు వర్క్‌ అగ్రిమెంట్‌ అవుతుంది. ఇందులో జీఎ్‌సటీ 18శాతం, టెండర్‌ లెస్‌, అధికారుల కమీషన్‌ పోను రూ.4లక్షల విలువ పని మిగులుతుంది. ఇలా వివిధ కోతలతో రూ.10లక్షల అంచనా పనిని రూ.4లక్షలతో ఎలా చేస్తారో, ఎంత నాణ్యతతో చేస్తారో అధికారులకే తెలియాలి.

Updated Date - Jun 14 , 2026 | 01:42 AM