కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:25 AM
శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
చంద్రగిరి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.15 నుంచి 8.35 గంటల మధ్య కుంభ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవర్ల సమక్షంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణలు నడుమ కంకణ భట్టర్ బాలాజీరంగాచార్యుల ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. రాత్రి పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు. వృషభ, అశ్వ, గజరాజులు ముందు ఠీవిగా నడుస్తుండగా మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, గోవింద నామస్మరణల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత వీరాసనంలో కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీనివాసమంగాపురంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో వెంకటమురళీకృష్ణ, ఆలయ ప్రత్యేకాధికారి, సీపీఆర్వో డాక్టర్ రవి, డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్లు రాజ్‌కుమార్, రమే్‌షకుమార్, అర్చకులు, సిబ్బంది, ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి, ఏఎంసీ చైర్మన్ గౌస్‌బాషా, టీడీపీ నాయకులు బాలకృష్ణమూర్తి, రమే్‌షరెడ్డి, మేడసాని కుమార్, చిరంజీవి, బాలసుబ్రహ్మణ్యం, రాజారాయల్, సునీల్, దొమ్మలపాటి సతీష్, గాలి సతీష్, తదితరులు పాల్గొన్నారు.