Share News

ఆనంద జలతాండవం

ABN , Publish Date - Jan 12 , 2026 | 01:44 AM

హంద్రీనీవా జలాలతో చెరువులు కళకళలాడుతున్నాయి. కరువు ప్రాంత రైతుల్లో ఆనందకాంతులు నింపుతున్నాయి. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరుతోంది.

ఆనంద జలతాండవం
నిండుకుండలా మంగళం చెరువు

కృష్ణా జలాలతో కళకళలాడుతున్న చెరువులు

కరువు ప్రాంతంలో పెరిగిన భూగర్భ జలాలు

పుంగనూరు, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా జలాలతో చెరువులు కళకళలాడుతున్నాయి. కరువు ప్రాంత రైతుల్లో ఆనందకాంతులు నింపుతున్నాయి. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరుతోంది.

రాయలసీమకు వరప్రసాదిని

కరువు ప్రాంత రైతులకు హంద్రీనీవా వరప్రసాదినిగా మారింది. తాజాగా మదనపల్లె హంద్రీనీవా-సుజలస్రవంతి సర్కిల్‌ పరిధిలో 176 చెరువులు పూర్తిగా నిండాయి. 37 చెరువులు పాక్షికంగా నిండాయి. మరో 99 చెరువులను నింపాలని అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటి వరకు నిండిన చెరువులతో దాదాపు 20వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. అంతేకాక భూగర్భ జలాలూ పెరుగుతున్నాయి.

నిండిన చెరువుల వివరాలు

పుంగనూరు బ్రాంచి కెనాల్‌ పరిధిలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో 36 చెరువులు పూర్తిగా.. రెండు పాక్షికంగా, మదనపల్లెలో 3 పూర్తిగా.. మరో మూడు పాక్షికంగా, పుంగనూరులో నాలుగు పూర్తిగా.. ఒకటి పాక్షికంగా, పలమనేరులో 5, కదిరిలో 4 చెరువులు పూర్తిగా నిండాయి. కుప్పం బ్రాంచ్‌కెనాల్‌ పరిధిలో 85 పూర్తిగా.. 16 పాక్షికంగా, పలమనేరులో 39 పూర్తిగా.. 15పాక్షికంగా చెరువులు నిండాయి. సీఎం ఆదేశాలతో చివర కుప్పం నుంచి కృష్ణాజలాలను చెరువులకు అనుసంధానిస్తూ తూములు, పైపుల ద్వారా నీటిని విడుదల చేశారు. పుంగనూరు మండలంలో ఈడిగపల్లె వద్ద సన్యాసిచెరువు, మంగళం చెరువు, లద్దిగం చెరువు, కొండసముద్రం, పుంగమ్మచెరువుకు నీరు వెళ్లాయి. వాటినుంచి చైన్‌సిస్టం ద్వారా మొరవనీటిని దిగువ ఉన్న చెరువులకు నీటిని పంపుతున్నారు. 243 ఎంసీఎ్‌ఫటీ సామర్ధ్యంగల పీటీఎం, 185 ఎంపీఎ్‌ఫటీగల సీటీఎం చెరువులతో పాటు కుప్పం పరమసముద్రం, పెద్దపంజాణి శంకర్రాయులపేట, చాలమంగళం, రంగసముద్రం, పుంగనూరు చెరువులు నిండాయి. హంద్రీనీవా జలాలలతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గాల్లోని 312 పెద్ద, చిన్న చెరువులను నింపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్‌ ఎస్‌ఈ (మదనపల్లె) విఠల్‌ ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Jan 12 , 2026 | 01:44 AM