అర్హులకే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:32 AM
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవినీతి జరిగిందన్న వైసీపీ ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పునరుద్ఘాటించారు. క్రీడా ప్రతిభ,
వైసీసీ నేతల ఆరోపణలు అవాస్తవాలు
మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
రాయచోటి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవినీతి జరిగిందన్న వైసీపీ ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పునరుద్ఘాటించారు. క్రీడా ప్రతిభ, నిబంధనల ప్రకారం అర్హత సాధించిన వారికే ఉద్యోగాలు లభించాయన్నారు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అసూయతోనే వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. డీఎస్సీ స్సోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు పొందిన లక్ష్మిపతి నాయక్, కట్ల రాముడు అనే టీచర్లు మంగళవారం మర్యాదపూర్వకంగా మంత్రిని కలిశారు. వీరిద్దరరూ రాయచోటిలోని తిరుపతినాయుడు కాలనీకి చెందిన వారు. ఉద్యోగం సాధించేందుకు చేసిన కృషి, క్రీడారంగంలో సాధించిన అర్హతల గురించి మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇరువురిని శాలువా కప్పి సత్కరించారు. స్పోర్ట్స్ కోటాలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా డీఎస్సీ ద్వారా ఉద్యోగం లభించిందని వీరిద్దరూ మంత్రికి చెప్పారు. అర్హత ఆధారంగా ఉద్యోగం రావడంతో సంతోషంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో నోబెల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరాజు, డైట్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి, పలువురు టీడీపీ నాయకులు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.