జీవిత ఖైదీలకే పనులు
ABN , Publish Date - Aug 14 , 2026 | 02:52 AM
పలమనేరులో జైళ్ల శాఖ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంకులో పనిచేస్తూ.. జీవిత ఖైదీ సూరి పరారయ్యాడు. ఈ క్రమంలో ఖైదీల్లో ఎవరికి ఇలాంటి పనులు అప్పగిస్తారు? పర్యవేక్షణ ఎలా ఉంటుందనేది పరిశీలిస్తే.. జీవిత ఖైదీగా జైలు శిక్ష అనుభవిస్తూ.. సత్ప్రవర్తన కలిగిన వారికే ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.
చిత్తూరు అర్బన్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): పలమనేరులో జైళ్ల శాఖ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంకులో పనిచేస్తూ.. జీవిత ఖైదీ సూరి పరారయ్యాడు. ఈ క్రమంలో ఖైదీల్లో ఎవరికి ఇలాంటి పనులు అప్పగిస్తారు? పర్యవేక్షణ ఎలా ఉంటుందనేది పరిశీలిస్తే.. జీవిత ఖైదీగా జైలు శిక్ష అనుభవిస్తూ.. సత్ప్రవర్తన కలిగిన వారికే ప్రభుత్వం ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. సాధారణంగా ఇందులో రెండు రకాల ఖైదీలు ఉంటారు. ఏడేళ్ల జైలు శిక్ష పడిన వారిని షార్ట్ టర్మ్.. 14 ఏళ్ల వరకు శిక్ష పడిన వారిని లాంగ్ టర్మ్ ఖైదీలుగా గుర్తిస్తారు. షార్ట్‌టర్మ్, లాంగ్ టర్మ్ ఖైదీలుగా ఉన్న వారి సత్ప్రవర్తనను బట్టి జైళ్లశాఖ పనులకు పంపిస్తుంది. ఇందుకోసం జైళ్లశాఖ డీఐజీ, డీజీ, జిల్లా స్థాయిలో జైళ్లశాఖ సూపరింటెండెంట్, కలెక్టర్, మరికొంతమంది కమిటీ సభ్యులుగా ఉంటారు. ఖైదీల ప్రవర్తనను బట్టి జైళ్లశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపుతారు. ఖైదీల నేరచరిత్ర, శిక్ష, జైలులో ఉన్నప్పుడు వారి ప్రవర్తన, అధికారులతో మాట్లాడేటప్పుడు మానసిక పరిస్థితులను అంచనా వేస్తారు. ఏ ఖైదీ అయితే సత్ప్రవర్తనతో ఉంటాడని భావిస్తారో.. అలాంటివారినే జైళ్లశాఖ నిర్వహించే పెట్రోల్ బంకు లేదా చదువుకున్న వారైతే డేటా ఎంట్రీ ఆపరేటర్లు, స్థానికంగా జైలులో అవసరమనిపించే పనులను కల్పిస్తారు. ఇలా జీవిత ఖైదీగా ఉన్న సూరిని పలమనేరు ఐవోసీఎల్ పెట్రోల్ బంకులో పనికి పంపారు. ఇలా పనులు చేసే ఖైదీలకు రోజుకు రూ.200 చొప్పున వేతనం ఇస్తారు. నెలాఖరులో వారికి వచ్చిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ మొత్తంలో సగం డబ్బులను ఖైదీ ఖర్చు పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తారు. లేదంటే ఆ మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులకు కూడా పంపించుకోవచ్చు. కాగా, ఖైదీలు పనులు చేసే చోట జైలు అధికారుల నిఘా ఉంటుంది. ఒక పెట్రోల్ బంకులో ఐదారుగురు పనిచేస్తున్నారనుకుంటే.. ఇద్దరు జైలు వార్డర్లతో నిఘా పెడతారు. ఖైదీలు పనికి వచ్చినప్పటి నుంచి డ్యూటీ ముగించుకుని వెళ్లే వరకు వార్డర్లు అక్కడే ఉండి పరిశీలిస్తుంటారు. డ్యూటీ ముగించుకుని తిరిగి జైలుకు వెళ్లేంత వరకు వీరి పర్యవేక్షణలోనే ఉంటారు. ఇంతటి పర్యవేక్షణ ఉన్నా పలమనేరులో జీవిత ఖైదీ ఎలా తప్పించుకున్నాడన్నది చర్చగా మారింది.