తప్పుడు విద్యార్హతతో ఉద్యోగం
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:41 AM
తప్పుడు విద్యార్హత సర్టిఫికెట్లను సమర్పించి ఉద్యోగాలు పొందిన ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లను తొలగించారు. వారిపై చర్యలకు ఉప లోకాయుక్త సిఫార్సు చేశారు. కర్నూలులోని ఉప లోకాయుక్త జస్టిస్ రజని ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు.
ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్ల తొలగింపు
క్రిమినల్ కేసులకు ఉప లోకాయుక్త సిఫార్సు
జీత భత్యాలు తిరిగి వసూలుకు ఆదేశం
చిత్తూరు రూరల్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): తప్పుడు విద్యార్హత సర్టిఫికెట్లను సమర్పించి ఉద్యోగాలు పొందిన ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లను తొలగించారు. వారిపై చర్యలకు ఉప లోకాయుక్త సిఫార్సు చేశారు. కర్నూలులోని ఉప లోకాయుక్త జస్టిస్ రజని ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. 2024లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ ల్యాబ్ టెక్నీషయన్ల పోస్టులను భర్తీ చేశారు. ఈ నియమకాల్లో పలువురు తప్పుడు విద్యార్హత సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లు కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన కర్నూలు ఉప లోకాయుక్త జస్టిస్ రజని.. ముగ్గురు తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు గురువారం గుర్తించారు. వీరిలో మదనపల్లె ఏరియా ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న పూర్ణావతి, గంగవరం, నాగలాపురం పీహెచ్‌సీలలో పనిచేస్తున్న నాగవేణి, కిరణ్‌కుమార్‌ను విధుల నుంచి తొలగిస్తూ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, వీరు ఉద్యోగంలో చేరి పొందిన జీతాలను కూడా రికవరీ చేయాలని ఆదేశాలిచ్చారు.