జోరుగా జల్‌జీవన్ మిషన్ పనులు
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:47 AM
రాయచోటి నియోజకవర్గం మిట్ట ప్రాంతం కావడంతో నీటికోసం పూర్తిగా వర్షాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. వర్షాలు కురిస్తే చెరువులు, కుంటలు నిండి ఏడాదిపాటు తాగు, సాగు నీటిని ఇబ్బంది ఉండదు. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావం నెలకొంది.
వెలిగల్లు ప్రాజెక్టు నుంచి 851 గ్రామాలకు తాగునీరు లక్ష్యం
2027 అక్టోబర్ నాటికి ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్లు
లక్కిరెడ్డిపల్లె, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): రాయచోటి నియోజకవర్గం మిట్ట ప్రాంతం కావడంతో నీటికోసం పూర్తిగా వర్షాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. వర్షాలు కురిస్తే చెరువులు, కుంటలు నిండి ఏడాదిపాటు తాగు, సాగు నీటిని ఇబ్బంది ఉండదు. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావం నెలకొంది. చెరువుల్లో చూద్దామన్నా నీటి బొట్టు లేదు. రామాపురం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, చిన్నమండెం, సంబేపల్లె, రాయచోటి మండలాల ప్రజలు నీటి సమస్య ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో ఇప్పటికే తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో జల్‌జీవన్ మిషన్ పథకంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.400కోట్లతో వెలిగల్లు ప్రాజెక్టు నుంచి గ్రామాలకు పైప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నాయి. అక్కడక్కడా ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించి వాటిద్వారా 851 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ముమ్మరంగా పనులు చేపడుతున్నాయి. వెలిగల్లు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 4.6 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.64 టీఎంసీలు ఉన్నాయి. అందులో 0.35 టీఎంసీల నీటిని జల్‌జీవన్ పథకం ద్వారా 851 గ్రామాలకు అందించేలా పనులు జరుగుతున్నాయి. 2027 అక్టోబర్ నాటికి గ్రామాల్లో ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్‌తో శుద్ధమైన నీటిని అందించే లక్ష్యంతో ఉన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా 243 ఓవర్ ట్యాంకుల నిర్మాణ పనులు సాగుతున్నాయి. త్వరలో జల్‌జీవన్ పథకం ద్వారా తాగునీరు అందిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు.