మదనపల్లెలో వార్ వన్‌సైడ్
ABN , Publish Date - Nov 05 , 2026 | 12:48 AM
మదనపల్లె మున్సిపాలిటీలో మంగళవారం వెలువడిన ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించింది. 1961 నుంచి ఇప్పటి వరకూ మున్సిపల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయంలో తనదైన ముద్ర వేసుకుంది. 2024 సాధారణ ఎన్నికల తరహాలోనే 2026 మున్సిపోరులోనూ అవే ఫలితాలు పునరావృతం అయ్యాయి.
- ఫ్యాన్ రెక్కలు ముక్కలు
- మున్సిపోల్స్‌లో 32 స్థానాలతో కూటమి ఘన విజయం
- 12 సీట్లకే పరిమితమైన వైసీపీ
మదపనల్లె, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): మదనపల్లె మున్సిపాలిటీలో మంగళవారం వెలువడిన ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించింది. 1961 నుంచి ఇప్పటి వరకూ మున్సిపల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయంలో తనదైన ముద్ర వేసుకుంది. 2024 సాధారణ ఎన్నికల తరహాలోనే 2026 మున్సిపోరులోనూ అవే ఫలితాలు పునరావృతం అయ్యాయి. వైసీపీ కకావికలం కాగా, ప్రతిపక్ష హోదా కూడా దక్కని పాతాళానికి పడిపోయింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ తర్వాత 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, అక్రమ కేసులతో ఆ పార్టీ నేతలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. అధికారం ఉందికదా అని అడ్డదారులు తొక్కడం, అడ్డువచ్చిన వారిని కేసులు, దాడులతో దారిలోకి తెచ్చుకోవడం రివాజుగా చేసుకున్నారు. ప్రజలను, ప్రతిపక్ష పార్టీ పార్టీలను ఇబ్బంది పెడితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలియజేసేలా ప్రజలు బుద్ధి చెప్పారు.
విజయ పథానికి చేర్చిన అభివృద్ధి..సంక్షేమం
రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆ పార్టీలను విజయ పథానికి చేర్చాయి. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు కలుపుగోలుతనం, నేతలందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్లడం కూడా కలిసొచ్చింది. ఈ అంశాలు ఎన్నికల్లో వార్ వన్ సైడ్ చేశాయి. జిల్లాలోని పుంగనూరు, రాయచోటి మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే మదనపల్లె పురపాలికలో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందనుకున్న రాజకీయ పార్టీల అంచనాలు మంగళవారం నాటి ఫలితాల్లో తారుమారయ్యాయి. 2021 మున్సిపల్ ఎన్నికల నాటికి ఇక్కడి మున్సిపాలిటీలో 35 వార్డులు ఉండగా అందులో 15వార్డులను ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను బెదిరించి నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకున్నారు. అరాచకాలు చేశారు. కొందరు నామినేషన్లు వేసినా వారిపేరుతో విత్‌డ్రా కూడా చేసి ఏకగ్రీవం చేసుకున్నారు. ఈ క్రమంలో అప్పట్లో 20 వార్డులకు ఎన్నికలు జరగ్గా, పోలింగ్‌లోనూ అవకాశం లేకుండా చేయడంతో కేవలం టీడీపీ రెండు వార్డులకే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రస్తుత వైసీపీ పరిస్థితి చూస్తే కేవలం 12వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వార్డుల విభజన అనంతరం మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 48 పెరగగా, అందులో టీడీపీ అత్యధికంగా 22 వార్డులు, జనసేన ఆరు, బీజేపీ నాలుగు, బీఎస్పీ ఒకటి, స్వతంత్రులు ముగ్గురు విజయం సాధించారు. కూటమి చైర్మన్ అభ్యర్థి జి.శ్రీరామ్ చినబాబుకు 37,832 ఓట్లు, వైసీపీ చైర్మన్ అభ్యర్థి జింకా వెంకటాచలపతికి 28,199 ఓట్లు పోలయ్యాయి. శ్రీరామ్ చినబాబు 9,633 ఓట్ల మెజారిటీ సాధించి మున్సిపల్ చరిత్రను తిరగరాశారు.
వైసీపీ ఓటమికి కారణాలివే..
మదనపల్లె వైసీపీలో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, నిధులు సమకూర్చడం, వాటిని క్షేత్రస్థాయిలో ఓటర్లకు పంపిణీ, పోల్ మేనేజ్మెంట్ వరకూ వార్డుల వారీగా ఆ పార్టీలోని నేతలు, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించారు. మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి.నరే్‌షకుమార్‌రెడ్డి, వైసీపీ ఇన్చార్జి ఎస్.నిసార్ అహ్మద్, మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులకు నాలుగు నుంచి ఆరు వార్డులు కేటాయించారు. వార్డుల్లో పర్యవేక్షణ లేకపోవడం, ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకోకపోవడం, పోలింగ్ రోజు, అంతకుముందు నేతలు బాధ్యతగా వ్యవహరించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ఏజెంట్ల నియామకం వరకూ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. చైర్మన్ అభ్యర్థి జింకా వెంకటాచలపతి, కౌన్సిలర్ అభ్యర్థులే ఒంటరి పోరాటం చేసినట్లు చెబుతున్నారు.